ETV Bharat / bharat

లూప్​లైన్​లోకి 'కోరమాండల్'.. అందుకే ప్రమాదం.. ఘటన జరిగిందిలా..

author img

By

Published : Jun 3, 2023, 5:40 PM IST

odisha-train-accident-how-odisha-train-accident-happened
ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది

Odisha Train Accident : ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడించింది రైల్వే శాఖ. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే ఈ పెను ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. అదే విధంగా ప్రమాదం ఎలా జరిగిందో రైల్వే శాఖ వివరించింది.

How Odisha Train Accident Happened : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదం.. దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే, సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే.. ఈ పెను ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో వెల్లడించింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే లూప్‌లైన్‌లోకి.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మారినట్లు తెలిపింది.

odisha-train-accident-how-odisha-train-accident-happened
రైలు ప్రమాద దృశ్యాలు
odisha-train-accident-how-odisha-train-accident-happened
రైలు ప్రమాద దృశ్యాలు

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్​కు బదులుగా లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. చెన్నై వెళ్తున్న ఈ రైలును మెయిన్‌లైన్‌లోనే వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పొరపాటున ఈ రైలు లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్‌లైన్‌లో ఓ గూడ్స్‌ రైలును నిలిపి ఉంచారు. దీంతో వేగంగా గూడ్స్​ రైలును ఢీకొట్టి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. అనంతరం పట్టాలు తప్పింది. దీని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ చేరుకుంది. సాయంత్రం 6.50 గంటలకు బహనగ స్టేషన్‌ దాటింది ఈ ఎక్స్‌ప్రెస్‌.

odisha-train-accident-how-odisha-train-accident-happened
రైలు ప్రమాద దృశ్యాలు
odisha-train-accident-how-odisha-train-accident-happened
రైలు ప్రమాద దృశ్యాలు

సాయంత్రం 6.52 గంటలకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఖాంతాపార స్టేషన్‌ను దాటింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢీకొట్టగానే దాని 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్​.. బలంగా వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి.

సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే రైలు ప్రమాదం జరిగుండొచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు సమాచారం. దీంతో లూప్‌లైన్‌ ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా.. వేగాన్ని నియంత్రించడం సాధ్యంకానట్లు తెలుస్తోంది. గూడ్స్‌ను ఢీకొట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌.. అనంతరం దానిమీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరగ్గానే కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటే..
1257 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించాయి. అయితే వీరు కాకుండా జనరల్‌ బోగీల్లో ఎంతమంది ఎక్కారన్నది ఇంకా తెలియరాలేదు.

ఎంటీ లూప్‌లైన్‌?
స్టేషన్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ లూప్‌లైన్లను నిర్మిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ లూప్‌లైన్ల పొడవు 750 మీటర్ల వరకు ఉంటుంది. మల్టిపుల్‌ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్‌ రైలు ఆగేందుకు వీలుగా ఈ లూప్​లైన్​లను నిర్మిస్తారు.

అయితే ప్రమాద సమయంలో కోరమాండల్​కు.. మెయిన్‌లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అది నేరుగా లూప్​లైన్​లోకి వెళ్లింది. నిజంగానే రైలును లూప్​లైన్​లోకి అనుమతిస్తే.. నెమ్మదిగా వెళ్లమనే సిగ్నల్​ ఇచ్చేవారు. కానీ అప్పుడు మాత్రం మెయిన్​లోకి వెళ్లమని రైలును అనుమతిచ్చినా.. అది నేరుగా లూప్​లైన్​లోకి ప్రవేశించింది. దీనిపైనే ఇప్పుడు రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.