ETV Bharat / bharat

కరోనా పరీక్షలకు ఇక సులువైన విధానం!

author img

By

Published : May 29, 2021, 6:54 AM IST

corona swab tests
కరోనా పరీక్షలు

కరోనా అనుమానితుల నుంచి నమూనాను సేకరించేందుకు ఓ సులువైన, వేగవంతమైన విధానాన్ని నేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (నీరి) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా నమూనాలను సేకరించేందుకు ముక్కు లేదా గొంతులోకి సాధనాలను చొప్పించాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. దీనివల్ల ఖరీదైన మౌలిక వసతుల అవసరం తప్పుతుందని పేర్కొన్నారు.

కొవిడ్​ అనుమానితుల నుంచి నమూనా(శ్వాబ్​)ను సేకరించి, ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష కోసం సిద్ధం చేయడానికి భారత శాస్త్రవేత్తలు ఒక సులువైన, వేగవంతమైన విధానాన్ని కనుగొన్నారు. మౌలిక వసతులు పెద్దగా లేని గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో కరోనా నిర్ధరణ పరీక్షలను నిర్వహించడానికి దీనివల్ల వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్​ఐఆర్​) ఆధ్వర్యంలోని నేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​(నీరి) శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా నమూనాల సేకరణకు చాలా సమయం పడుతుందని పరిశోధనలో పాలుపంచుకున్న కృష్ణ ఖైర్నార్​ తెలిపారు. పైగా దీనికోసం రోగి ముక్కు లేదా గొంతులోకి సాధనాలను చొప్పించాల్సి ఉంటుందని, దీనివల్ల వారికి అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. వీటిని సేకరించడానికి నైపుణ్యం కూడా అవసరమన్నారు. ఈ నమూనాలను కలెక్షన్​ సెంటర్​కు రవాణా చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

ద్రావణంతో పుక్కిలించి..

ఈ ఇబ్బందులను అధిగమించడానికి సెలైన్​ గార్గల్​ ఆర్​టీ-పీసీఆర్​ విధానాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఈ ప్రక్రియలో నమూనాల సేకరణకు రోగి శరీరంలోకి ఎలాంటి సాధనాలనూ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇందులో సెలైన్​ ద్రావకంతో కూడిన ఒక కలెక్షన్​ గొట్టం ఉంటుంది. ఈ ద్రావణంతో పుక్కిలించి, తిరిగి గొట్టంలోకి దాన్ని ఊయాల్సి ఉంటుంది. అనంతరం దీన్ని ల్యాబ్​కు పంపి, అక్కడ గది ఉష్ణోగ్రత ఉంచుతారు. ఈ నమూనాను వేడి చేసినప్పుడు 'ఆర్​ఎన్​ఏ టెంప్లేట్​' ఒకటి వెలువడుతుంది. దాన్ని ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష కోసం పంపొచ్చు. నమూనాల సేకరణ, ప్రాసెసింగ్​ కోసం ఈ విధానాన్ని ఉపయోగించడం వల్ల ఖరీదైన మౌలిక వసతుల అవసరం తప్పుతుంది. ఈ పద్ధతిలో వ్యర్థాలు కూడా తక్కువగా వెలువడుతాయని, అందువల్ల ఇది పర్యావరణ అనుకూలమైందని ఖైర్నార్ తెలిపారు. ఈ విధానానికి నాగ్​పుర్​ నగరపాలక సంస్థ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: 'కొవిడ్ రోగుల్లో మరణాలకు కారణమిదే..!'

ఇదీ చూడండి: 'భారత్​లో డిసెంబర్​ నాటికి వ్యాక్సినేషన్​ పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.