ETV Bharat / bharat

రూ.28 అప్పు తీర్చేందుకు దేశాలు దాటొచ్చి...

author img

By

Published : Dec 4, 2021, 2:51 PM IST

Navy Commander BS Uppal
రూ. 28 అప్పు తీర్చేందుకు దేశాలు దాటొచ్చి..!

విదేశాల్లో స్థిరపడ్డ నేవీ మాజీ కమాండర్​ బీఎస్​ ఉప్పల్​.. ఓ ప్రత్యేక పని మీద భారత్​కు వచ్చారు. 68ఏళ్ల క్రితం చేసిన అప్పును తీర్చడం కోసం హరియాణా హిసార్​కు వెళ్లారు. రూ. 28 అప్పును వడ్డీతో సహా తీర్చేశారు. ఆ కథను మీరూ చూసేయండి.

వేల కోట్ల రూపాయల అప్పును ఎగవేసి.. విదేశాలకు వెళ్లిపోతున్న వారి గురించి రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాము. అలాంటి ఈ కాలంలో.. రూ. 28 అప్పును చెల్లించడం కోసం విదేశాల నుంచి భారత్​కు వచ్చారు ఓ వ్యక్తి. 68 ఏళ్ల తర్వాత అప్పును వడ్డీతో సహా తీర్చేశారు. హరియాణా హిసార్​లో జరిగింది ఈ ఘటన.

అమెరికా టు ఇండియా..

బీఎస్​ ఉప్పల్​ బాల్యం అంతా హిసార్​లోనే గడిచింది. అక్కడే ఉన్న హర్జిరామ్​ హిందూ పాఠశాలలో ఆయన 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. ఆయన ఇంటి దగ్గర 'దిల్లీ వాలా హల్వాయి' అనే దుకాణం ఉండేది. అక్కడ ఎప్పుడూ లస్సీ తాగేవారు. 1954లో ఒకసారి అత్యవసరంగా హిసార్​ను వీడాల్సి వచ్చింది. అప్పటికే ఆ దుకాణ యజమానికి బీఎస్​ ఉప్పల్​.. రూ.28 అప్పు ఉన్నారు. ఊరు మారినా ఆ విషయాన్ని ఆయన మర్చిపోలేదు. ఆ తర్వాత ఆయన నేవీలో చేరారు. హిసార్​కు తిరిగి వెళ్లడం కుదరలేదు. ఇక రిటైర్మంట్​ తర్వాత కుమారుడితో కలిసి బీఎస్​ ఉప్పల్​.. అమెరికాలో స్థిరపడ్డారు.

ఉప్పల్​ ఏం చేస్తున్నా, ఎక్కడున్నా.. అప్పు తిరిగి ఇవ్వడం గురించే ఆయన ఆలోచించేవారు. చివరకు.. ఎలాగైనా అప్పు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భారత్​కు వచ్చారు. హిసార్​కు వెళ్లి ఆ దుకాణం యజమానిని కలిశారు. 'నేను మీ తాతకు 28 రూపాయలు అప్పు ఉన్నాను. అది తిరిగి ఇవ్వడానికే ఇక్కడకు వచ్చాను' అని చెప్పారు. అప్పును వడ్డీతో సహా తీర్చేశారు బీఎస్​ ఉప్పల్​. దుకాణ యజమానికి రూ. 10వేలు ఇచ్చారు.

ఆ తర్వాత బీఎస్​ ఉప్పల్​ తాను చదువుకున్న స్కూలుకు వెళ్లారు. అది మూతపడి ఉండటం వల్ల నిరాశ చెందారు.

భారత్​-పాకిస్థాన్​ యుద్ధం సమయంలో నేవీ కమాండర్​గా పనిచేశారు బీఎస్​ ఉప్పల్​. శత్రు దేశ జలాంతర్గామిని పడగొట్టి.. దేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం.. 'నేవీ అవార్డ్​ ఫర్​ బ్రేవరీ'తో సత్కరించింది.

ఇదీ చూడండి:- కొబ్బరికాయ కొడితే కొత్త రోడ్డుకు పగుళ్లు- ధర్నాకు దిగిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.