ETV Bharat / bharat

'మహా' సీఎంగా ఫడణవీస్​.. డిప్యూటీ సీఎంగా శిందే.. ముహూర్తం ఫిక్స్!

author img

By

Published : Jun 30, 2022, 2:09 PM IST

maharashtra-crisis
మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్

Maharashtra crisis: మహారాష్ట్రలోని 'మహా వికాస్​ అఘాడీ' కూటమి ప్రభుత్వం కూలిపోయిన క్రమంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. భాజపాతో చర్చలు కొనసాగుతున్నాయని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ మరోమారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

Maharashtra crisis: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్​ ఠాక్రే రాజీనామా చేసిన క్రమంలో.. ప్రస్తుతం తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ శిందే గురువారం మధ్యాహ్నం.. గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. గవర్నర్​ను కలిసి భాజపాకు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించనున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ శుక్రవారం ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు రెబల్​ ఎమ్మెల్యే, ఏక్​నాథ్​ శిందే క్యాంప్​ ప్రతినిధి.. దీపక్​ కేసర్కార్​. ఉద్ధవ్​ ఠాక్రే రాజీనామా చేసినప్పుడు తాము సంతోషించలేదని, ఆయన్ను పదవి నుంచి దింపటం తమ ఉద్దేశం కాదన్నారు. ఇప్పటికీ తాము శివసేనలోనే ఉన్నామని ఉద్ఘాటించారు. భాజపాతో చర్చలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

"ఏక్​నాథ్​ శిందే ముంబయికి వెళ్లారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రాభివృద్ధి కోసమేనని ఆయన చెప్పారు. మేము ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ప్రజల్లో మాపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకే సంజయ్​ రౌత్​ అలాంటి వాఖ్యలు చేశారు. మేము ఠాక్రే కుటుంబానికి వ్యతిరేకం కాదు. ఎంవీఏ కూటమి నుంచి బయటకు వస్తే ఆయనతో మాట్లాడేందుకు మేము సిద్ధమే. కానీ, ఆయన ఇంకా వారితోనే ఉన్నారు. మేము ఠాక్రేకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లలేదు. ఆయనపట్ల మాకు గౌరవం ఉంది. ప్రమాణ స్వీకారం ఎప్పుడనే విషయంపై భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ నిర్ణయం తీసుకుంటారు. ఆ తేదీ ఇవ్వటం గవర్నర్​ ప్రత్యేక అధికారం. వారితో మా చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం."

- దీపక్​ కేసర్కార్​, ఎమ్మెల్యే, ఏక్​నాథ్​ శిందే క్యాంప్​ ప్రతినిధి.

మరోవైపు.. తదుపరి కార్యాచరణపై భాజపా కోర్​ కమిటీ గురువారం మధ్యాహ్నం సమావేశం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం గవర్నర్​ను.. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరనున్నారని పేర్కొన్నాయి. జులై 1న ఫడణవీస్​ ముఖ్యమంత్రిగా, ఏక్​నాథ్​ శిందే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని తెలిపాయి. ​

ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల బలాబలాలు.. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన 55, ఎన్​సీపీ 53, కాంగ్రెస్​ 44, భాజపా 106, బహుజన్​ వికాస్​ అఘాడీ 3, సమాజ్​వాదీ పార్టీ 2, ఏఐఎంఐఎం 2, క్రాంతికార్​ శక్తికారీ పార్టీ 1, స్వతంత్రులు 13 మంది ఉన్నారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్​ లాట్కే మరణంతో ఓ స్థానం ఖాళీగా ఉంది. శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది తిరుగుబావుటా ఎగురవేశారు. వారితో పాటు 10 మంది స్వతంత్రులు వెళ్లారు. దాంతో ప్రభుత్వం కూలిపోయింది.

ఇదీ చూడండి: అందరిచూపు రాజ్​భవన్​వైపే.. మహారాష్ట్రలో నెక్ట్స్​ ఏంటి?

రాజీనామా.. విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్‌ ఠాక్రే నిష్క్రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.