ETV Bharat / bharat

Loan App Harassment in Nellore: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. నెల్లూరులో దా'రుణ' వేధింపులు

author img

By

Published : Jul 29, 2023, 10:11 PM IST

Etv Bharat
Etv Bharat

Loan App Harassment at Kovur: అవసరం కోసం అప్పు తీసుకోవడమే పాపమై పోయింది. తీసుకున్న అప్పు తీర్చినా ఇంకా కట్టాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. దా'రుణ' యాప్​ల వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు తీసుకోగా.. తాజాగా ఓ యువతి పట్ల రుణయాప్​లు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఫొటోలు మార్ఫింగ్​ చేసి వాట్సాప్​ ద్వారా పలువురికి పంపించారు. దీంతో షాక్​ తిన్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Loan App Harassment on Woman in Nellore: యమపాశాల్లా వల విసురుతున్నాయి వందల కొద్ది రుణ యాప్‌లు.. అవసరం ఉన్నా లేకున్నా పదే పదే ఫోన్లు చేసి రుణం తీసుకునేలా ప్రలోభపెట్టడం.. తీసుకున్న అప్పు చెల్లించినా.. వడ్డీలకు చక్రవడ్డీలు విధించి ఇచ్చిన దానికంటే రెట్టింపు వసూళ్లు చేయడం వాళ్లకు పరిపాటిగా మారింది. ఎవరైనా ప్రశ్నిస్తే ఆపదలో ఆదుకోవడానికి రుణాలు ఇచ్చామని మాయమాటలు చెబుతారు వారి మాట వినకపోతే ఎవ్వరికి తెలియని వివిధ రకాల ఫోన్ నెంబర్లతో కాల్స్, మెసేజ్​లు చేసి మానసికంగా విసిగించి, వేధించి ప్రాణాలను తోడేస్తారు.

అంతటితో ఆగకుండా డబ్బు తిరిగి చెల్లించని వారి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతుంటారు. యాప్​ నిర్వాహకుల నుంచి తప్పించుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక చాలా మంది తనువు చాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ యువతి రుణ యాప్​ల వలకు చిక్కింది. రుణ యాప్​ల వేధింపులు భరించలేకపోయింది... ఇక చేసేదేంలేక చాకచక్యంగా దిశ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి : నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం మండలంలో ఓ యువతి నివాసం ఉంటుంది. వారం రోజుల క్రితం తనకు అత్యవసరంగా 3వేల రూపాయలు కావాల్సి వచ్చింది. లోన్​యాప్ గూగుల్​లో సెర్చ్ చేసింది ఆ యువతి. క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్​లలో యువతి తన వివరాలను అప్​లోడ్​ చేసింది. ఆ రెండు యాప్​ల నుంచి 3,700 రూపాయలు యువతి అకౌంట్​లో క్రెడిట్ అయ్యాయి. 3 రోజుల తరువాత తీసుకున్న అమౌంట్​ను ఆమె తిరిగి చెల్లించింది. అయినప్పటికీ, ఇంకా బకాయి ఉన్నారని లోన్​యాప్ నిర్వాహకుల నుంచి యువతికి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

నగదు కట్టకపోతే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని యువతిని భయపెట్టారు. శుక్రవారం యువతి ఫోన్​ యాప్ నిర్వాహకులు హ్యాక్ చేశారు.అనంతరం యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి.. యువతి ఫొటోలను కాంటాక్ట్ నెంబర్లకు పంపించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి ఏడుస్తూ దిశ SOSకు కాల్ చేసి సహాయం కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సైబర్ పోలీసులకు కూడా వివరాలను అందించారు. లోన్ యాప్ నుంచి ఎటువంటి కాల్స్ వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని యువతికి సూచించారు. అదే సమయంలో ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని, ఆ యువతికి దిశ పోలీసులు భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.