ETV Bharat / bharat

'జోషీమఠ్'పై పీఎంఓ సమీక్ష.. సీఎంకు మోదీ ఫోన్​.. అండగా ఉంటామని హామీ.. ​

author img

By

Published : Jan 8, 2023, 5:53 PM IST

Updated : Jan 8, 2023, 6:55 PM IST

joshimath cracks
జోషీమఠ్​లో కూలిన ఇళ్లు

Joshimath Landslide : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం సమీక్ష నిర్వహించింది. అంతకుముందు.. ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ ధామీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం చేస్తామని ధామీకి ప్రధాని హామీ ఇచ్చారు.

Joshimath Landslide : ఉత్తరాఖండ్​లోని జోషీమఠ్ ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులతో పాటు జోషీమఠ్ జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. జోషీమఠ్​లో నెలకొన్న పరిస్థితులను ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి సుఖ్​బీర్ సింగ్ సందు వివరించారు.

"ఒక ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం, నాలుగు ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు జోషీమఠ్​కు చేరుకున్నాయి. ​బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. జోషీమఠ్‌లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిపుణులు సహకరిస్తున్నారు. బార్డర్​ మేనేజ్​మెంట్ సెక్రటరీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ) సభ్యులు సోమవారం ఉత్తరాఖండ్​లో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తారు. ఎన్ఎండీఏ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటి రూర్కీ, వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ల నిపుణుల బృందం పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుంది."

--అధికారులు

joshimath cracks
జోషీమఠ్​లో ధ్వంసమైన రోడ్డు

అంతకుముందు.. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో వందల సంఖ్యలో ఇళ్లు కుంగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామితో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

'ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. జోషీమఠ్‌లో పరిస్థితిని.. పునరావాసం, రక్షణ చర్యలను చర్యలను అడిగి తెలుసుకున్నారు. పర్వతాలపై ఉండి ప్రమాదకర పరిస్థితికి చేరుకున్న నగరాలపై చర్చించాం. జోషీమఠ్‌ను కాపాడేందుకు వీలైనంత సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు'

-- పుష్కర్​సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

joshimath cracks
జోషీమఠ్​లో ధ్వంసమైన ఇల్లు

జోషీమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించామని చమోలీ జిల్లా కలెక్టర్​ హిమాన్షు ఖురానా తెలిపారు. జోషీమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్లలో నివసిస్తున్న 60 కుటుంబాలకు తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని ఆయన పేర్కొన్నారు. అలాగే ధ్వంసమైన ఇళ్లకు వెళ్లి నష్టాన్ని అంచనా వేశారు. జోషీమఠ్​లో మొత్తం 4,500 ఇళ్లు ఉన్నాయని.. వాటిలో 610 ఇళ్లకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయని హిమాన్షు తెలిపారు. 'అద్దె ఇళ్లకు వెళ్లాలనుకునే బాధితులకు.. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల వరకు నెలకు రూ.4వేలు చెల్లిస్తుంది. దెబ్బతిన్న ఇళ్లలో నివసించవద్దు. అలా ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం.' అని హిమాన్షు తెలిపారు.

జోషీమఠ్ చరిత్ర..
జోషీమఠ్‌ హిమాలయ సానువుల్లో ఓ చిన్న పట్టణం. బద్రీనాథ్‌ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడి విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సైనికులకు, హిమాలయ యాత్రకు వెళ్లిన పర్యటకులకు ఇదే బేస్‌ క్యాంప్‌. బద్రీనాథ్‌ సందర్శనకు వెళ్లే భక్తుల్లో చాలామంది రాత్రి ఇక్కడే బస చేస్తారు. భారత సైనిక దళాలకు ఇదో వ్యూహాత్మక పట్టణం. ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థానమైన విష్ణుప్రయాగకు చేరువలో జోషీమఠ్ ఉంటుంది.

Last Updated :Jan 8, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.