ETV Bharat / bharat

భూవివాదంలో బంధువు దారుణ హత్య.. తల నరికి, సెల్ఫీలు తీసుకుని..

author img

By

Published : Dec 6, 2022, 1:56 PM IST

jharkhand-man-beheads-cousin
jharkhand-man-beheads-cousin

భూవివాదం కారణంగా ఓ యువకుడు తన బంధువును అపహరించి, దారుణంగా హత్య చేశాడు. తలను, మొండాన్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. నిందితుడు స్నేహితులు.. ఆ తలతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రూరమైన ఘటన గురించి విన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఝార్ఖండ్​లోని కుంతీలో జరిగిన ఘటన క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. భూమి కోసం ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ఓ 20 ఏళ్ల యువకుడు ఏకంగా తన బంధువునే హత్య చేశాడు. అతడి తల నరికాడు. నిందితుడి స్నేహితులు.. దానితో సెల్ఫీలు తీసుకున్నారు. జిల్లాలోని ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

డిసెంబర్ 1న కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 24 ఏళ్ల కాను ముండాను అతడి బంధువుల్లో ఒకరైన సాగర్​ ముండా తన స్నేహితులతో కలిసి అపహరించాడు. మృతుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా తన కొడుకు కనిపించకపోవడం వల్ల చుట్టుపక్కల వారిని అడిగాడు. వారు అతడ్ని తన మేనల్లుడు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన తండ్రి యువకుడి కోసం తీవ్రంగా గాలించాడు.

అతడి ఆచూకీ తెలియక డిసెంబరు 2న పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు కాను ముండా తండ్రి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిండితులతో పాటు కాను కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వారిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు, అతని భార్యతో సహా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో బయటపడ్డ విషయాల ఆధారంగా యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొండెం కుమాంగ్ గోప్లా అడవిలో, తల దుల్వా తుంగ్రీ ప్రాంతంలో పోలీసులకు దొరికింది.

మృతుడి సెల్​ఫోన్​తో పాటు మరో ఐదు మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రెండు పదునైన ఆయుధాలు, ఓ గొడ్డలి, ఒక ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న భూ వివాదమే ఈ హత్యకు కారణమని వెల్లడించారు.

భార్యపై పైశాచికం..
మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తన భార్యపై చేయి చేసుకోవడమే కాకుండా ఆమె ప్రైవేట్​ భాగాల్లోకి ఓ ప్లాస్టిక్​ వస్తువును చొప్పించాడు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

అసలేం జరిగింది: ముంబయిలోని ములుంద్​కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో తూలుతున్న భర్తకు సపర్యలు చేసేందుకు ముందుకు వచ్చిన భార్యను విచక్షణారహితంగా కొట్టిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఆమెను అసహజ శృంగారంలో పాల్గొమని బలవంతపెట్టాడు. దీంతో ప్రతిఘటించిన ఆమె ప్రైవేట్​ భాగాల్లోకి ఓ ప్లాస్టిక్​ పైపు లాంటి వస్తువును చొప్పించాడు. నొప్పిని భరించలేక ఆ మహిళ ఆస్పతికి వెళ్లింది.
వైద్యులు ఆమెను ఆరాతీయగా అసలు విషయం బయటపెట్టింది. పరీక్షల అనంతరం వైద్యులు ఆమె ప్రైవేట్​ భాగంలోని వస్తువును వెలికితీశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై..
ప్రియుడు పిలిచాడని వెంట వెళ్లిన ఓ యువతిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతి సహాయం కోసం పోలీస్​ స్టేషన్​కు కాల్​ చేయగా అసలు విషయం బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను రక్షించి ఆపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన త్రిపురలోని అగర్తలలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉదయపుర్​కు చెందిన ఓ 15 ఏళ్ల యువతి నిందితుల్లో ఒకరితో ఏడాది పాటు రిలేషన్​లో ఉండేది. తమ బంధాన్ని అదునుగా చేసుకున్న ఆ యువకుడు తనపై అత్యాచారం చేసేందుకు ప్లాన్​ చేశాడు. శనివారం తనని రాయ్​బారి ప్రాంతానికి రమ్మని పిలిచాడు. ప్రియుడు మాట మేరకు పిలిచిన ప్రాంతానికి వెళ్లిన ఆ యువతిని అతను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ఆపై తన స్నేహితులిద్దరితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ తర్వాత వారందరు అక్కడ నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతి ఎమర్జెన్సీ నంబర్​కు కాల్​ చేసింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు యువతిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను సోమవారం రాయబారిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దళిత యువతిపై అత్యాచారం..
ఓ 23 ఏళ్ల దళిత యువతిని తన పక్కింటివాడే అత్యాచారం చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బల్లియాలో వెలుగు చూసింది. డిసెంబర్ 4న ఎవరూ లేని సమయం చూసుకుని ఆ యువతి ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ధీరేంద్ర సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.