ETV Bharat / bharat

IIT Hyderabad Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి 'అదృశ్యం.. విషాదాంతం'

author img

By

Published : Jul 25, 2023, 1:24 PM IST

IIT Hyderabad Student Suicide
IIT Hyderabad Student Suicide

IIT Hyderabad Student Suicide in Vizag : ఐఐటీ హైదరాబాద్​లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. ఫోన్​ సిగ్నల్స్ ఆధారంగా అతను విశాఖపట్నం వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు.. అక్కడ ఓ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఎదిగిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

IIT Hyderabad Student Suicide in Vishaka : ఐఐటీ హైదరాబాద్​లో మరో విద్యార్థి ఆత్మహత్మ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గతంలో ఒత్తిడి తట్టుకోలేక.. ఇతర కారణాల వల్ల పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తన ప్రాణాలు బలి తీసుకున్నాడు. అయితే ఈ విద్యార్థి ఈ నెల 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాడు. రెండ్రోజులైనా తిరిగి రాకపోవడంతో క్యాంపస్ యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆ విద్యార్థి అదృశ్యమైన విషయం బయటపడింది. ఆ తర్వాత సదరు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారం రోజుల నుంచి పోలీసులు అతడి కోసం వెతికారు. చివరకు ఇవాళ ఈ మిస్సింగ్ కేసు.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో విషాదంగా ముగిసింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్(21) ఐఐటీ హైదరాబాద్​లో మెకానికల్ విభాగంలో సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 17వ తేదీన ఐఐటీహెచ్​ క్యాంపస్‌ నుంచి కార్తీక్ ఔటింగ్ కోసమని చెప్పి బయటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి క్యాంపస్​కు తిరిగి రాకపోవడంతో తన బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని అతడి స్నేహితులు భావించారు. మరుసటి రోజు కూడా రాకపోవడంతో ఇంటికి వెళ్లాడని అనుకున్నారు. కానీ రెండ్రోజుల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కార్తీక్ తల్లిదండ్రులు మొదట అతడి స్నేహితులకు.. తర్వాత క్యాంపస్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. వారు 17వ తేదీ బయటకు వెళ్లి తిరిగి రాలేదని చెప్పడంతో వారు కంగారు పడ్డారు. వెంటనే కార్తీక్ ఫ్రెండ్స్.. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి అక్కడికి వెళ్లాడేమోనని ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోయే సరికి అనుమానం వచ్చి ఈనెల 19వ తేదీన కార్తీక్ తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

IIT Hyderabad Student Suicide News : రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ కోసం గాలింపు షురూ చేశారు. అతడి ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం ప్రారంభించారు. సిగ్నల్ ఏపీలోని విశాఖలో చూపించడంతో అతడి తల్లిదండ్రులను తీసుకుని విశాఖపట్నానికి వెళ్లారు. అక్కడ విశాఖ బీచ్​లో చివరగా సిగ్నల్ చూపించడంతో అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని గమనించారు. ఆ ఫుటేజీ ద్వారా కార్తీక్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. వెంటనే అతడి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. మృదేహాన్ని ఇవాళ ఉదయం కేజీహెచ్‌కు తరలించారు.

వారం రోజులుగా కుమారుడు తిరిగి వస్తాడేమోనని ఆశగా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలింది. చేతికందొచ్చిన కొడుకు విగత జీవిగా పడి ఉండటం చూసి ఆ కన్నవాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.