ETV Bharat / bharat

'మిషన్ ముస్కాన్'తో పిల్లల జీవితాల్లో వెలుగులు.. కుటుంబాల చెంతకు 723 మంది బాలలు.. IAS అధికారి చొరవతో..

author img

By

Published : Aug 20, 2023, 11:12 AM IST

Updated : Aug 20, 2023, 12:25 PM IST

Mission Muskaan
Mission Muskaan

IAS Officer Mission Muskaan : ఓ ఐఏఎస్​ అధికారి చేపట్టిన 'మిషన్ ముస్కాన్'.. ఎంతో మంది పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. తల్లిదండ్రులు, బంధువులకు దూరమైన చిన్నారులను తిరిగి వారి చెంతకు చేరుస్తోంది. ఎందరో కళ్లలోనో ఆనందాన్ని నింపుతున్న మిషన్ మస్కాన్ అంటే ఏంటి? ఎవరా ఐఏఎస్​ అధికారి?

  • షామ్లీ జిల్లాకు చెందిన 10ఏళ్ల బాలుడు 2019లో తప్పిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు ఆ బాలుడు ఎంతో కష్టపడ్డాడు. ఎన్నోరోజులు అమ్మా.. నాన్నా.. అంటూ విలపించాడు. అయినా కలవలేకపోయాడు. ఐఏఎస్​ అధికారి ప్రారంభించిన 'మిషన్​ ముస్కాన్'​.. అతడి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. 20 రోజుల క్రితం బాలుడిని తన కుటుంబంతో కలిపింది.
  • ఝార్ఖండ్​కు చెందిన మరో బాలుడు.. 2018లో తన తల్లిదండ్రులతో కలిసి వారణాసికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో దీనదయాళ్​ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్​లో తప్పిపోయాడు. ఎంత ప్రయత్నించినా తన కన్నవారి దగ్గరకు చేరుకోలేకపోయాడు. ఇటీవలే మిషన్​ ముస్కాన్​ ద్వారా తన కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్నాడు.

IAS Officer Mission Muskaan : ఇలా ఆ ఐఏఎస్​ అధికారి ప్రారంభించిన 'మిషన్​ ముస్కాన్'.. ఎంతో మంది పిల్లలకు కొత్త జీవితాలను ప్రసాదించింది. వందలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. మిషన్​ ముస్కాన్​ ద్వారా ఇప్పటి వరకు 723 పిల్లలు.. తన కుటుంబసభ్యుల వద్ద చేరుకున్నారు. అసలేంటి మిషన్​ ముస్కాన్​? ఆ అధికారి ఎవరు?

ఆ పిల్లలను చూశాక..
Himanshu Nagpal IAS Mission Muskaan : ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి చీఫ్​ డెవలెప్​మెంట్​ ఆఫీసర్​ హిమాన్షు నాగ్​పాల్​.. 2019 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన వారణాసి జల్లాలో సీడీఓ (చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సమీపంలోని రైల్వే స్టేషన్లు, గంగా ఘాట్​తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పిల్లలను గమనించారు. వారంతా వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులకు, బంధువులకు దూరమైన వారిగా గుర్తించారు. ఆ తర్వాత వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు. అలా గతేడాది జులైలో 'మిషన్​ ముస్కాన్'​ను ప్రారంభించారు. తల్లిదండ్రులకు, బంధువులకు దూరమైన పిల్లలకు తిరిగి వారి దగ్గరకు చేర్చడమే లక్ష్యంగా ఆ మిషన్​ను మొదలుపెట్టారు. ఇలా ఇప్పటి వరకు ఈ మిషన్​ ముస్కాన్​ ద్వారా 732 మంది పిల్లలను.. తమ సొంతవారి వద్దకు చేర్చారు.

Mission Muskaan
పాఠాలు వింటున్న చిన్నారులు

12 బృందాలు.. 60 మంది అధికారులు..
IAS Mission Muskaan Children : పిల్లలు తప్పిపోయి.. తమకు దూరమయ్యారన్న బాధలో ఉన్న కుటుంబాల్లో తిరిగి సంతోషాన్ని నింపడమే 'మిషన్ ముస్కాన్' లక్ష్యమని సీడీఓ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. "ఒకరోజు రాత్రి.. వారణాసి నగర పర్యటనకు వెళ్లాను. ఆ సమయంలో రైల్వే స్టేషన్, గంగా ఘాట్ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు భిక్షాటన చేయడం లేదా ఇతర పనులు చేయడం గమనించాను. వెంటనే ఆలోచించి 'మిషన్ ముస్కాన్‌'ను ప్రారంభించాను. బంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, నేపాల్​తో పాటు అనేక ప్రాంతాలకు చెందిన పిల్లలు ఉన్నారు. అలాంటి వారిని తమ కుటుంబాలతో కలిపేందుకు 60 మంది అధికారులతో కూడిన 12 బృందాలను ఏర్పాటు చేశాను" అని తెలిపారు.

హిమాన్షు నాగ్‌పాల్, వారణాసి సీడీఓ

"వివిధ కారణాల ద్వారా సొంతవారికి దూరంగా ఉన్న పిల్లలకు మొదట షెల్టర్ హోమ్‌లో స్థానం కల్పిస్తాం. వాళ్లకు మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. వారి చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. ఆ తర్వాత మానసిక నిపుణుల సహాయంతో.. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాజీవితంలో ఎలా జీవించాలి? ఎలా ప్రవర్తించాలి? కుటుంబంతో ఎలా ప్రవర్తించాలి? సమాజంలోని వ్యక్తులతో ఎలా కలిసిమెలసి జీవించాలి? అన్న విషయాలను వారికి చెబుతున్నాం."
-హిమాన్షు నాగ్‌పాల్, వారణాసి సీడీఓ

తల్లిదండ్రులను గుర్తించే వరకు..
Mission Muskaan IAS Officer : షెల్టర్ హోమ్‌లో ఉన్న పిల్లల తల్లిదండ్రులను గుర్తించే వరకు వారిని ఇక్కడే ఉంచుతామని హిమాన్షు నాగ్‌పాల్ చెప్పారు. "రెండేళ్లుగా షెల్టర్‌హోమ్‌లో ఉంటున్న చిన్నారులు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఈ షెల్టర్ హోమ్‌ల పరిస్థితి బాగా లేదు. ప్రభుత్వ నిధులు, ప్రైవేట్​ వ్యక్తుల విరాళాలు, వివిధ సంస్థల సహాయంతో మెరుగుపరిచాం. షెల్టర్‌హోమ్‌లో రోజూ వివిధ రకాల ఆటలు కూడా ఆడిస్తున్నాం. వారిని మానసికంగా దృఢంగా మార్చేందుకు వివిధ పద్ధతుల్లో పెయింటింగ్‌, డ్రాయింగ్‌ నేర్పిస్తున్నాం. సాధారణంగా పిల్లలను వారి కుటుంబాలతో కలపడానికి 5 నుండి 15 రోజులు పడుతుంది. ఏదైనా కారణం వల్ల ఆలస్యం అయితే.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం" అంటూ చెప్పుకొచ్చారు.

Mission Muskaan
చిన్నారులతో మాట్లాడుతున్న ఐఏఎస్​ అధికారి హిమాన్షు నాగ్​పాల్​
Last Updated :Aug 20, 2023, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.