ETV Bharat / bharat

'భాజపానే నా గురువు.. వారినుంచే అది నేర్చుకుంటున్నా'.. రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Dec 31, 2022, 3:05 PM IST

congress leader rahul gandhi
రాహుల్ గాంధీ

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఎలా ఉండకూడదో వారి నుంచే నేర్చుకుంటున్నానంటూ కాషాయ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను తాను గురువుల్లా భావిస్తానని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ. వారిని చూసే ఎలా ఉండకూడదో.. ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 'భారత్‌ జోడో యాత్ర' నుంచి విరామం తీసుకున్న రాహుల్.. శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భాజపాపై విమర్శలు చేశారు. ఏ కారణం లేకపోవడంతో 'భద్రతా ఉల్లంఘన' పేరుతో తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

"భారత్‌ జోడోను నేను కేవలం యాత్రగానే ప్రారంభించా. కానీ, ఇది ప్రజల గొంతుక అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ సందర్భంగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వారు ఎంతగా మమ్మల్ని టార్గెట్‌ చేస్తే.. మేం మరింత దృఢంగా మారుతాం. వారి మరింత దూకుడుగా మాపై విమర్శలు సాగించాలని కోరుకుంటున్నా. వారిని(భాజపా, ఆరెఎస్‌ఎస్‌) నేను గురువులుగా భావిస్తున్నా. వారిని చూసే ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా" అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

అనంతరం, ఇటీవల 'భద్రతా ఉల్లంఘనల' వ్యవహారంపై రాహుల్ స్పందించారు. "బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో వెళ్లాలని హోంశాఖ చెబుతోంది. అలా ఎలా చేయగలను? యాత్రలో నేను కాలినడనే వెళ్లాలి. అప్పుడు కూడా భద్రత ఎలా ఇవ్వాలో వారికి తెలుసు. కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. ఏ కారణం లేకపోవడంతో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నాపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు(భాజపా) యాత్రలు చేసినప్పుడు ఎలా భద్రత ఇస్తున్నారు?" అని ప్రశ్నించారు. ఇప్పటివరకు భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా సాగిందని రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కొత్త మార్గంలో ఎలా ఆలోచించాలో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

టీషర్టుపై ఎందుకంత ఆసక్తి..?
ఇక, ఈ యాత్రలో రాహుల్‌ ధరించిన టీ-షర్టులపై భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. "టీ-షర్టుపైన ఎందుకంత రగడ. నాకు చలి అంటే భయం లేదు. పెద్దగా చలి అనిపించలేదు. అందుకే స్వెటర్‌ వేసుకోలేదు. ఒకవేళ చలి ఎక్కువైతే స్వెటర్‌ గురించి ఆలోచిస్తా" అని తెలిపారు. ఈ యాత్రలో ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి తర్వాత ఓ వీడియో విడుదల చేస్తానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.