Gujarat wall collapse: ఓ ఉప్పు ఫ్యాక్టరీలోని గోడ కూలిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలోని హల్వాద్ ప్రాంతంలో ఈ విషాదం వెలుగుచూసింది.
ఇదీ జరిగింది.. సాగర్ సాల్ట్ పేరుతో ఉన్న ఈ ఉప్పు ఫ్యాక్టరీలో ఎప్పటిలాగే కూలీలు తమ పని చేసుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా గోడ కూలి అక్కడున్న వారిపైన పడింది. దీంతో అక్కడున్న 30 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులకు దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా అందులో చిక్కుకున్న వారు విగతజీవులుగా బయటపడుతున్నారు. ఇలా ఇప్పటివరకు ఈ మృతుల సంఖ్య 12కు చేరింది. గోడ దగ్గర పెట్టిన ఉప్పు బస్తాల లోడు ఒత్తిడి కారణంగానే.. గోడ కూలి అవతల పక్క ప్యాకింగ్ చేస్తున్న కూలీలపై పడినట్లు తెలుస్తోంది. భోజన విరామ సమయం కావడం వల్ల తక్కువ మంది కార్మికులు ఉన్నారని.. లేదంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.6లక్షలు పరిహారం: గుజరాత్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాన మంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి.. సహాయక చర్యలు ముమ్మరం చేయడంపై సూచనలు చేశారు. మరోవైపు.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు గుజరాత్ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి : రాజీవ్ హత్య కేసు దోషి విడుదల- సుప్రీం 'అసాధారణ' తీర్పు