ETV Bharat / bharat

ఫిఫా వరల్డ్​ కప్ విజయోత్సవాల్లో హింస ​.. కేరళలో ఎస్​ఐపై దాడి.. తూటా తగిలి మహిళ మృతి

author img

By

Published : Dec 19, 2022, 6:00 PM IST

Football fans beated the police man in kerala
పోలీసులును తీవ్రంగా కొట్టిన పుట్​బాల్​ అభిమానులు

ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్ సందర్భంగా కేరళలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. మితీమిరిన అభిమానం ఘర్షణలకు దారితీసింది. మ్యాచ్​ చూస్తూ ఇరుజట్ల అభిమానులు తీవ్రంగా కొట్టుకున్నారు. మరో చోట ఎస్సైపై కొందరు దాడికి తెగబడ్డారు. అర్జెంటీనా ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బుల్లెట్‌ తగిలి 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. మణిపుర్​లో ఈ ఘటన జరిగింది.

ఫుట్‌బాల్​పై అభిమానం హద్దులు మీరింది. కేరళలో హింసకు కారణమైంది. ఆదివారం రాత్రి ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. మద్యం మత్తులో ఉన్న కొందరు ఫుట్‌బాల్ అభిమానులు ఓ ఎస్సైపై దాడి చేశారు. మరోచోట అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల అభిమానులు తీవ్రంగా కొట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురం పొళియూర్​లో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్​పై క్రీడాభిమానులు ఫుట్‌బాల్​ మ్యాచ్ చూస్తున్నారు. ఆ సమయంలో ఓ అల్లరి మూక తాగొచ్చి అక్కడ రచ్చ చేసింది. దీంతో ఇబ్బంది పడ్డ ఫుట్‌బాల్​ వీక్షకులు.. పోలీసులకు ఫోన్​ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సాజీ.. వెంటనే ఘటన స్థలానికి వచ్చారు. అనంతరం ఆ అల్లరి మూకను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాగిన మత్తులో ఉన్న వారంతా ఎస్సైపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొచ్చిలోను ఈ తరహా ఘటనే జరిగింది. ఓ పోలీసు అధికారిని తీవ్రంగా కొట్టారు ఫుట్‌బాల్ అభిమానులు. కాలూర్​ మెట్రో స్టేషన్​ సమీపంలో ఈ దారుణం జరిగింది. అర్జెంటీనా విజయంపై కొందరు యువకులు సంబరా​ల పేరుతో రోడ్డుపై నానా హంగామా చేస్తున్నారు. దీన్ని అడ్డుకున్న పోలీసు అధికారి లిబిన్​పై యువకులు దాడికి తెగబడ్డారు. పోలీసును కొడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఘటనలో అరుణ్,​ శరత్​ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కన్నూరులోని పల్లియన్మూల ప్రాంతంలో విజయోత్సవాల్లో హింస జరిగింది. పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్‌ను వీక్షిస్తున్న అర్జెంటీనా, ఫ్రాన్స్‌ అభిమానులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఘటనలో అనురాగ్, ఆదర్శ్, అలెక్స్ ఆంటోనీ అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అనురాగ్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొట్టారక్కరలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మ్యాచ్ అనంతరం కొందరు అభిమానులు ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

బుల్లెట్‌ తగిలి 50 ఏళ్ల మహిళ మృతి..
అర్జెంటీనా ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బుల్లెట్‌ తగిలి 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. మణిపుర్‌, ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆదివారం రాత్రి 11.30 గంటలకు సింజమీ వాంగ్మా భీగ్యాబతి ఏరియాలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచిన వెంటనే పెద్ద ఎత్తున బాణసంచా, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బుల్లెట్​ వచ్చి బాధితురాలికి తగిలిందని వారు పేర్కొన్నారు.

"మృతురాలి నివాసం ఉంటున్న మొదటి అంతస్తులో రెండు బుల్లెట్ రంధ్రాలు కనిపించాయి. ఒక బుల్లెట్ ఆమె వీపును తాకగా, మరొకటి ఇనుప రేకుల గుండా వెళ్లింది." అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.
నిందితులను గుర్తించి అరెస్ట్​ చేసేంత వరకు అంత్యక్రియలు చేయమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.