ETV Bharat / bharat

సాధారణ జలుబు‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

author img

By

Published : Jun 16, 2021, 2:31 PM IST

Corona virus
కరోనా వైరస్​

కరోనా వైరస్‌ను నివారించేందుకు ఓవైపు అనేక వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తుండగా.. మరోవైపు చికిత్స కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌.. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొని, రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికాలోని యేల్ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. కణజాలంపై సార్స్​ కోవ్​-2 పునరుత్పత్తిని ఈ వైరస్ అడ్డుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ​

సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్​లు సార్స్​ కోవ్​-2(కొవిడ్​-19) వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ పరిశోధన తేల్చింది. ఈ అధ్యయనం జర్నల్​ ఆఫ్​ ఎక్స్​పెరిమెంటల్​ మెడిసిన్​లో మంగళవారం ప్రచురితమైంది. సాధారణ శ్వాసకోశ సంబంధిత 'రైనోవైరస్'​.. ఇంటర్​ఫెరాన్​ ప్రేరేపిత జన్యు కార్యకలాపాలను ప్రారంభిస్తుందని గుర్తించింది. ఈ జన్యువులు రోగనిరోధక వ్యవస్థలోని అణువులు ముందస్తుగా స్పందించేలా చేస్తాయని, దాని ద్వారా జలుబు సోకిన వాయుమార్గ కణజాలంలో సార్స్​ కోవ్​-2 పునరుత్పత్తిని అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

" కొవిడ్​-19 వ్యాప్తి చెందే క్రమంలో రక్షణ వ్యవస్థను ముందస్తుగా మేల్కొలపటం ద్వారా.. దానిని నిరోధిస్తుంది. ఇలా చేసేందుకు ఒక మార్గం ఉంది. రోగులకు ఇంటర్​ఫెరాన్స్​తో చికిత్స చేయటం. రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్​ అయిన ఇంటర్​ఫెరాన్​ ఔషధంగానూ లభిస్తుంది. అయితే.. ఇది పూర్తిగా సమయంపై ఆధారపడి ఉంటుంది. "

- ఎలెన్​ పాక్స్​మాన్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, యేల్ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​, అమెరికా.

కొవిడ్​-19 బారిన పడిన తర్వాత ఇంటర్​ఫెరాన్​ అధిక మోతాదులతో వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అది రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించేందుకు కారణమవుతున్నట్లు గతంలో గుర్తించారు. అయినప్పటికీ.. ఇటీవలి జన్యుపరమైన పరిశోధనలను పరిశీలిస్తే.. ఇంటర్​ఫెరాన్​ ప్రేరేపిత జన్యువులు కొవిడ్​-19 నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ఆరుగంటలకు రెండింతలు..

ఆ దిశగా పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు రైనోవైరస్​లు.. సార్స్​కోవ్​-2 వైరస్​కు వ్యతిరేకంగా ఉపయోగపడతాయని గుర్తించారు. ల్యాబ్​లో అభివృద్ధి చేసిన మానవ శ్వాసకోశ కణజాలం వైరస్ బారినపడేలా చేశారు. తొలి మూడు రోజులు పరిశీలించారు. ప్రతి ఆరు గంటలకు వైరస్​ లోడ్​ రెండింతలైనట్లు కనుగొన్నారు. అయితే.. రైనోవైరస్​ బారిన పడిన కణజాలంపై కొవిడ్​-19 పునరుత్పత్తి పూర్తిగా ఆగిపోయినట్లు నిర్ధరించారు.

" కొవిడ్​ బారిన పడిన ప్రారంభ దశలో నాసల్​ స్వాబ్​ నమూనాలు పరిశీలించాం. వ్యాధి బారిన పడిన తొలి రోజుల్లో సార్స్​ కొవ్​-2 వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆధారాలున్నాయి. రోగనిరోధక వ్యవస్థ మేల్కొనేలోపే ఇది జరిగిపోతోంది. ప్రతి ఆరు గంటలకు రెండింతలవుతోంది. కొంత మంది రోగుల్లో అది మరింత ఎక్కువగా ఉంది. ఇంటర్​ఫెరాన్​ చికిత్స వైరస్​ను అడ్డుకుంటుంది. కానీ అది గమ్మత్తైన విషయం. వ్యాధి బారిన పడిన తర్వాత లక్షణాలు కనిపించనపుడే ఇది ప్రభావంతంగా ఉంటుంది. "

- ఎలెన్​ పాక్స్​మాన్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, యేల్ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​, అమెరికా.

కొవిడ్​-19 చికిత్సలో ఇంటర్​ఫెరాన్​ ట్రయల్స్​ జరుగుతున్నాయని, ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన తొలి దశలోని రోగుల్లో సానుకూల ఫలితాలు కనిపించాయన్నారు ఫాక్స్​మాన్​. ఏడాదిలోని నిర్దిష్ట సమయంలో జలుబు అనేది సాధారణంగా ఎందుకు ఉంటుంది, ఆ సమయంలో ఇన్​ఫ్లూయెంజా వంటి ఇతర వైరస్​ల ప్రభావం తక్కువగా ఎందుకు ఉంటుందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చూడండి: 'డెల్టా వేరియంట్​పై ఆ టీకా భేష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.