ETV Bharat / bharat

ఇంటి నుంచే ఓటు వేసే ఛాన్స్.. వారికి మాత్రమే.. ఆ రాష్ట్రంలో అమలు

author img

By

Published : Mar 12, 2023, 9:14 AM IST

election commission of india vote from home
election commission of india vote from home

ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఎలక్షన్​ కమిషన్​ మొదటి సారిగా కర్ణాటకలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్​ కుమార్ ప్రకటించారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

దేశంలో తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే విధానం కర్ణాటకలో పూర్తిస్థాయిలో అమలు కానుంది. ఈ ఏడాది అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు (వీఎఫ్​హెచ్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు.. ఇంటి నుంచే ఓటు వేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు 5 రోజులు ముందుగా వెలువరించే నోటిఫికేషన్‌ను అనుసరించి అర్హత ఉన్నవారు 'ఫార్మ్ 12డి' ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోలింగ్ ప్రక్రియను మొత్తం వీడియో తీస్తామని చెప్పారు. వీఎఫ్​హెచ్ సౌకర్యం కల్పించిన చోట అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తామని చెప్పారు. గతంలో వీఎఫ్​హెచ్ విధానాన్ని పలు ఉప ఎన్నికలతో పాటు గుజరాత్ ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసింది.

"80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్ స్టేషన్​కు వచ్చి ఓటు వేయాలని ప్రోత్సహిస్తాం. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి మాత్రం ఈ వెసులుబాటు ఉపయోగించుకోవచ్చు. పూర్తి ప్రక్రియను వీడియో తీస్తాం. ఓటింగ్ అంతా రహస్యంగానే జరుగుతుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాం. సక్షమ్ అనే యాప్​లో తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వొచ్చు. అందులో ఉన్న ఆప్షన్స్ ఎంచుకొని ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు."
-కమిషనర్ రాజీవ్ కుమార్, కర్ణాటక ప్రధాన ఎన్నికల

మరోవైపు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసేందుకు 'సువిధ' అనే మొబైల్ అప్లికేషన్ రూపొందించినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ పేరుతో ఆన్​లైన్ పోర్టల్ ఇప్పటికే ఉందని గుర్తు చేశారు. సువిధ పోర్టల్​ను ఉపయోగించి ఎన్నికల మీటింగ్​లు, ర్యాలీల అనుమతుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. 'నో యువర్ క్యాండిడేట్' (KYC) కార్యక్రమంలో భాగంగా.. అభ్యర్థుల గురించి తెలుసుకునేలా ఓటర్లను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ పోర్టల్‌, సోషల్​మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థిని ఎందుకు ఎన్నుకున్నారో, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు టిక్కెట్ ఇచ్చారో ఓటర్లకు తెలియజేయాలి అని రాజీవ్​ కుమార్ కోరారు.

224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 సీట్లు కేటాయించినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 16,976 మంది శతాధిక వృద్ధులు, 4,699 మంది థర్డ్ జెండర్లు, 9.17 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారు. అలాగే, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షల మంది, దివ్యాంగులు 5.55 లక్షల మంది ఉన్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లతో పాటు వృద్ధులు, యువత, దివ్యాంగులు తమ ఓటును సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తున్నందున.. ఆ తేదీలోపే ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మూడు రోజులు పాటు కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.