ETV Bharat / bharat

దిల్లీ X కేంద్రం వివాదానికి తెర.. బడ్జెట్​కు ఆమోదముద్ర

author img

By

Published : Mar 21, 2023, 12:16 PM IST

Updated : Mar 21, 2023, 3:14 PM IST

delhi-budget-2023-stopped-kejriwal-letter-to-modi
నిలిచిన దిల్లీ బడ్జెట్​ 2023

దిల్లీ వార్షిక బడ్జెట్​కు ఆమోద ముద్ర వేసింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్​ ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్​ అడ్డుకుంటోందని ఆప్​ ఆరోపణల నేపథ్యంలోనే బడ్జెట్​కు ఆమోదం తెలిపింది కేంద్ర హోంశాఖ.

దిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. బడ్జెట్​ ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్​ అడ్డుకుంటోందని ఆప్​ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే వార్షిక పద్దుకు ఆమోదం తెలిపింది కేంద్ర హోంశాఖ. ఈ విషయాన్ని లెఫ్టినెంట్​ గవర్నర్​ కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

అంతకుముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టడాన్ని ఆపవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. దేశ 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారని.. దిల్లీ ప్రజలపై ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు. బడ్జెట్‌ను ఆమోదించాలని.. దిల్లీ ప్రజలు చేతులెత్తి వేడుకుంటున్నట్లు తెలిపారు.

బడ్జెట్‌ ఆమోదం పొందనందున నేటి నుంచి దిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పొందలేరని.. అది కేంద్ర ప్రభుత్వ గూండాయిజమని కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్‌ ఆమోదం పొందనందున మంగళవారం వార్షిక పద్దును సభలో ప్రవేశపెట్టడం లేదని దిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేవనెత్తిన సందేహాలను నివృతి చేసి, మళ్లీ పంపాలని కేజ్రీవాల్ సర్కార్‌ను కోరినా.. 4 రోజులుగా సమాధానం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే దిల్లీ సీఎస్​ దస్త్రాలను దాచిపెట్టారని.. దిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్ గహ్లోత్ ఆరోపించారు.

దిల్లీ బడ్జెట్​పై.. కేంద్రం వివరణ అడిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ ప్రభుత్వం ప్రకటనలకు ఎక్కువ, మిగతా అభివృద్ది కార్యక్రమాలను తక్కువ కేటాయింపులు చేసిందని ఆరోపణల నేపథ్యంలో ఈ వివరణ కోరినట్లు తెలిపాయి. దీనిపై స్పందించిన దిల్లీ ఆర్థిక శాఖ మంత్రి.. కైలాశ్ గహ్లోత్ ఈ ఆరోపణలను ఖండించారు. అవన్నీ వాస్తవాలు కాదన్నారు. ప్రభుత్వ బడ్జెట్​ మొత్తం రూ.78,800 కోట్లుగా ఉందన్నారు. అందులో రూ.22,000 కోట్లు మౌలిక వసతులపై ఖర్చు చేసేందుకు కేటాయించామని వెల్లడించారు. రూ.550 కోట్లు మాత్రమే ప్రకటన కోసం కేటాయించినట్లు తెలిపారు. గత సంవత్సరం కూడా ఇంతే మొత్తాన్ని ప్రకటనల కోసం కేటాయించినట్లు గుర్తు చేశారు.

"బడ్జెట్​పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ.. దానికి ఆమోదం తెలపలేదు. అందుకు సంబంధించి మార్చి 17న ఓ లేఖను సీఎస్​ ద్వారా పంపింది. దీన్ని మూడు రోజులుగా సీఎస్​ తన వద్దే ఉంచుకున్నారు. దీంతో బడ్జెట్​ ఆమోదం పొందకపోవడానికి గల కారణాలు రహస్యంగానే ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నాకు లేఖ గురించి తెలిసింది. సాయంత్రం 6 గంటలకు అధికారికంగా నాకు ఆ లేఖ అందింది. అంటే దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు రోజు ఈ లేఖ అందింది." అని కైలాశ్ గహ్లోత్ అన్నారు. బడ్జెట్‌ను ఆలస్యం చేయడంలో దిల్లీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

Last Updated :Mar 21, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.