ETV Bharat / bharat

దేశంలో చివరి దశకు చేరిన కరోనా.. మరో 12 రోజుల్లో..

author img

By

Published : Apr 12, 2023, 5:26 PM IST

Updated : Apr 12, 2023, 5:53 PM IST

covid endemic in india latest news
దేశంలో చివరి దశకు చేరిన కరోనా.. అయినా మాస్క్​ తప్పనిసరి!

భారత్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న వేళ కాస్త ఊపిరి పీల్చుకునే విషయం చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో కొవిడ్ ఎండమిక్‌ దశకు చేరిందని అంచనా వేసింది.

దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు ఊరటనిచ్చే సంకేతాలిస్తున్నాయి. భారత్‌లో కొవిడ్ ఎండమిక్‌ దశకు చేరిందని అంచనా వేస్తున్నాయి. కేసులు మరో 10 నుంచి 12 రోజులు పాటు పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజువారీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ XBB.1.16 రకమే కారణమని ఆ వర్గాలు వెల్లడించాయి.

దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా నివారణ సన్నద్ధతపై మాక్‌డ్రిల్‌ కూడా నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కొవిడ్ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ XBB.1.16 రకమే పెరుగుదలకు కారణమన్న అధికార వర్గాలు ఇప్పటికీ ఒమిక్రాన్, దాని ఉపరకాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపాయి.

మిగిలిన వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపడంలేదని వివరించాయి. XBB.1.16 రకం కేసులు ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా.. మార్చి నాటికి 35.8శాతానికి చేరాయి. దీని వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వ్యాక్సిన్​ తయారీ పునఃప్రారంభం
కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు తాము తయారు చేసిన కొవిషీల్డ్​ టీకా ఉత్పత్తిని పునఃప్రారంభించినట్లు ప్రముఖ ఔషధ సంస్థ సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ప్రకటించింది. కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా బుధవారం వెల్లడించారు. "ముందు జాగ్రత్తగా మేము రిస్క్ తీసుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. 18 ఏళ్లకు పైబడి వయసు వారికి బూస్టర్​ డోస్​గా ఇచ్చేందుకు ఆమోదం పొందిన కొవావ్యాక్స్ టీకా 60 లక్షల డోసులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కానీ డిమాండ్ మాత్రం సున్నా. వయోజనులంతా బూస్టర్ డోసు తీసుకోవాలి" అని చెప్పారు పూనావాలా. కొవావ్యాక్స్ బూస్టర్​ డోస్.. కొవిన్ యాప్​లోనూ ఉందని గుర్తు చేశారు.
కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2021 డిసెంబర్​లోనే నిలిపివేసింది.

మంగళవారం 7,830 కేసులు
భారత్​లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 7,830 మంది కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. గత 223 రోజుల్లో ఇదే అత్యధికం. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మంగళవారం కరోనా కారణంగా 16 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 5,31,016కు చేరిందని తెలిపింది.

Last Updated :Apr 12, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.