ETV Bharat / bharat

గుజరాత్‌ ఎన్నికలు.. కాంగ్రెస్‌, NCP మధ్య కుదిరిన పొత్తు.. 3స్థానాల కోసమే..

author img

By

Published : Nov 11, 2022, 10:51 PM IST

congress ncp alliance in gujarat
గుజరాత్ ఎన్నికలు

Congress NCP Alliance In Gujarat : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో ఎన్సీపీ జట్టుకట్టింది. రాష్ట్రంలోని 182 స్థానాలకుగానూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. మూడు స్థానాల్లో పోటీ చేయనుంది.

Congress NCP Alliance In Gujarat : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు జట్టుకట్టాయి. శుక్రవారం ముందస్తు పొత్తు ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 182 స్థానాలకుగానూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. మూడింట పోటీ చేయనుంది. ఇరు పార్టీల నేతలు అహ్మదాబాద్‌లో సమావేశమై వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కూటమి ఏర్పాటుకు విఫలయత్నం చేశాయి. దీంతో వేర్వేరుగానే ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్సీపీ తరఫున.. కేవలం కందాల్‌ జడేజా ఒక్కరే కుతియాణా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

'గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి పోటీ చేయనున్నాయి. కూటమిలో భాగంగా ఆనంద్‌ జిల్లాలోని ఉమ్రేఠ్‌, అహ్మదాబాద్‌లోని నరోదా, దాహోడ్‌లోని దేవ్‌గఢ్‌ బరియా స్థానాలనుంచి ఎన్సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు' అని జీపీసీసీ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ వెల్లడించారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగిన వారితోపాటు రాజ్యాంగ పరిరక్షణ, దేశ సమైక్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నవారు ఒక్కతాటిపైకి వస్తున్నారని.. ఈ కూటమి కూడా అందులో భాగమేనని ఠాకూర్‌ అన్నారు. మరోవైపు.. ఎన్సీపీ కేటాయించిన ఈ మూడు స్థానాలూ ప్రస్తుతం అధికార భాజపా చేతిలో ఉన్నాయి.

గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఎన్సీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ విలేకరులతో చెప్పారు. 'మూడు స్థానాల్లో నిజాయతీగా పోటీ చేస్తాం. మాపై ఉంచిన నమ్మకానికిగానూ కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఎన్సీపీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఎటువంటి పనులు చేయం' అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో డిసెంబరు 1, 5న రెండు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి: పాముతో వీరోచితంగా పోరాడి ముగ్గురు పిల్లల్ని కాపాడుకున్న శునకం

ఫిట్​నెస్​ కోసం ఆ దుంపలు తిని కానిస్టేబుల్​ అభ్యర్ధి మృతి.. వాట్సాప్​లో మెసేజ్​ చూసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.