ETV Bharat / bharat

ఫోన్​ ఏదైనా ఛార్జర్ ఒకటే, కేంద్రం కీలక నిర్ణయం

author img

By

Published : Aug 17, 2022, 5:55 PM IST

common charger for all phones
ఫోన్​ ఏదైనా ఛార్జర్ ఒకటే, కేంద్రం కీలక నిర్ణయం

మొబైల్ ఫోన్స్​, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకే రకం ఛార్జర్​ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారీదారులతో బుధవారం సమావేశమై, ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. కామన్​ ఛార్జర్​ విధానం అమలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల బృందం ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ బృందం రెండు నెలల్లో నివేదిక ఇవ్వనుంది.

Common charger for all phones : ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కామన్ ఛార్జర్​ తీసుకురావడంలో సాధ్యాసాధ్యాలు, ఇతర సమస్యలపై అధ్యయనానికి నిపుణుల బృందం ఏర్పాటుకు సిద్ధమైంది. ఒక్కో డివైజ్​కు ఒక్కో రకం ఛార్జర్​ కాకుండా.. అన్నింటికీ సింగిల్ ఛార్జర్ తీసుకొచ్చే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి మొబైల్స్, ల్యాప్​టాప్​ తయారీదారులు; సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు; దిల్లీ ఐఐటీ, వారణాసి ఐఐటీ నిపుణులు హాజరయ్యారు.

డివైజ్​ను బట్టి ఛార్జర్లు మారే విధానం వల్ల ఈ-వ్యర్థాలు పెరిగి పర్యావరణంపై ప్రభావం పడుతోందని తయారీదారులు సైతం అంగీకరించారని చెప్పారు రోహిత్ కుమార్ సింగ్. అయితే.. ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డట్లు వెల్లడించారు. అన్నింటికీ ఒకటే ఛార్జర్ కాకపోయినా.. తొలి దశలో రెండు రకాల ఛార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని సమావేశం అనంతరం అన్నారు రోహిత్. ఇందులో సీ-టైప్ ఛార్జర్ కూడా ఒకటని చెప్పారు.

"ఇది చాలా సంక్లిష్టమైన విషయం. మనం నిర్ణయం తీసుకునే ముందు అందరి(తయారీదారులు, యూజర్లు, పర్యావరణం) వాదనల్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. భాగస్వామ్యపక్షాల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. వాటన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తాం. మొబైల్, ఫీచర్​ ఫోన్స్​; ల్యాప్​టాప్స్​, ఐప్యాడ్స్​; వేరబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్​.. ఇలా మూడు విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలు ఏర్పాటు చేస్తాం. ఆయా బృందాలను ఈ నెలలోనే నోటిఫై చేస్తాం. రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలు అందజేస్తాయి." అని వివరించారు రోహిత్.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్స్​, ట్యాబ్స్​కు.. వేర్వేరు రకాల ఛార్జర్​లు ఉన్నాయి. యాపిల్ ప్రత్యేకంగా రూపొందించిన లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్​లు మాత్రమే ఐఫోన్​కు పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్​ ఫోన్లు యూఎస్​బీ సీ-పోర్ట్​ ద్వారా ఛార్జ్ అవుతాయి. యాపిల్, ఆండ్రాయిడ్.. రెండు ఫోన్లు వాడే వారు ప్రతిసారీ రెండు ఛార్జర్​లు వెంట ఉంచుకోవాల్సిందే.

అటు ఖర్చు.. ఇటు చెత్త..
ఇప్పుడు అనేక కంపెనీలు కొత్త ఫోన్ కొనుగోలు చేసినా ఛార్జర్​ను ఇంతకుముందులా ఉచితంగా ఇవ్వడం లేదు. విడిగా కొనుక్కోవాల్సిందే. ఆండ్రాయిడ్ ఫోన్​ వాడుతున్న వ్యక్తి ఐఫోన్​ కొంటే.. లైట్నింగ్​ పోర్ట్​ ఛార్జర్​ కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఈ వేర్వేరు ఛార్జర్​ల విధానం.. వినియోగదారులకు ఆర్థికంగా భారం కావడమే కాక.. పర్యావరణాన్నీ దెబ్బతీస్తోంది. కోట్లాది ఎలక్ట్రానిక్ డివైజ్​లు, వాటికి వేర్వేరు ఛార్జల్​ కారణంగా ఈ-వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అక్కడ బంద్.. మరి ఇక్కడ?
Common charger European parliament : ఈ దుష్పరిణామాల దృష్ట్యా.. అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. స్మార్ట్​ ఫోన్లు, ట్యాబ్​లకు.. బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే ఛార్జర్ ఉండాలని తయారీ సంస్థలకు స్పష్టం చేశాయి. త్వరలోనే ఆ దిశగా సెల్​ఫోన్ కంపెనీలు మార్పులు చేసే అవకాశముంది. అయితే.. భారత్​లో ఆ రూల్​ లేదు కాబట్టి యాపిల్​ వంటి సంస్థలు తాము ప్రత్యేకంగా రూపొందించిన లైట్నింగ్ పోర్ట్​ ఛార్జర్​లను మన దేశంలో 'డంప్' చేసే ప్రమాదముంది. అంటే.. అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన ఈ-వేస్ట్​.. భారత్​లో పోగుపడే ముప్పు పొంచి ఉంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా కామన్​ ఛార్జర్ విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.