Coimbatore Car Blast Case : తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం భారీ ఆపరేషన్ చేపట్టింది. కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసులో రాష్ట్రంలోని దాదాపు 45 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. కోయంబత్తూరులోనే 21 ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేశారు. రాష్ట్ర పోలీసుల సహాయంతో నిందితుల నివాస గృహాల వద్ద తనిఖీలు చేశారు. కోయంబత్తూరులోని కొత్తమేడు, పొన్విజా నగర్, రాథినపురి, ఉక్కడం లాంటి ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.
అక్టోబర్ 23న ఉక్కడంలో కారులోని సిలిండర్ పేలి జమేషా ముబీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. హోంశాఖ ఆదేశాలతో 15 రోజుల క్రితం కేసు నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. గురువారం భారీ స్థాయిలో సోదాలు జరిపింది.
అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మొహ్మద్ తల్కా, మొహ్మద్ అజారుద్దీన్, మొహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మొహ్మద్ నివాజ్ ఇస్మాయిల్‌తో పాటు.. ముబీన్ బంధువైన అఫ్సర్ ఖాన్ ఉన్నాడు. వీరిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం-ఉపా కింద కేసు నమోదు చేశారు.
కారు పేలుడు ఘటన అనంతరం ముబీన్ ఇంట్లో సోదాలు చేయగా.. పొటాషియం నైట్రేట్, చార్కోల్, అల్యూమినియం పొడి, సల్ఫర్ లాంటివి లభ్యమైనట్లు చెప్పారు. వీటితో పేలుడు పదార్థాలు తయారు చేయొచ్చని తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ముబీన్‌ను.. 2019లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు విచారించడం గమనార్హం.
ఇవీ చదవండి : Terrorism: భారత్ లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. నదులే నావిగేటర్లు!
వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి