ETV Bharat / bharat

రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సుముఖత

author img

By

Published : Nov 28, 2020, 12:16 PM IST

farmers-centre
రైతు ఆందోళన

రైతులు చేపట్టిన ఛలో దిల్లీ ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. దిల్లీ నిరంకారీ మైదానంతోపాటు సరిహద్దుల్లో భారీగా రైతులు నిరసన చేపడుతున్నారు. చట్టాలకు వెనక్కి తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాల నడుమ రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కర్షక సంఘాలతో చర్చలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. డిసెంబర్​ 3న చర్చిస్తామని, అప్పటివరకు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కోరారు.

రైతులు చేపట్టిన ఛలో దిల్లీ ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్‌-హరియాణాకు చెందిన రైతులు సింఘులో ఇంకా తమ నిరసనను విరమించలేదు. అక్కడే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

స్తంభించిన రాకపోకలు..

పంజాబ్‌ నుంచి దిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో వారితో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారు. రాత్రంతా రహదారులపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు తమ నిరసనని కొనసాగించారు.

టిక్రీలోనూ..

దిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శనివారమూ భారీ స్థాయిలో భద్రతా బలగాల్ని మోహరించారు. ఇప్పటి వరకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 30 మంది రైతులు నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నానికి మరికొంత మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం చాలా మంది రైతు సంఘాల నాయకులు మైదానానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

మరిన్ని రాష్ట్రాల నుంచి..

మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఇవాళ ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు.

ఇదీ చూడండి: వరుడికి నిరసన సెగ- కాలినడకన వేదికకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.