ETV Bharat / bharat

CBI Counter on Petition of CM Jagan Advisor Ajeya Kallam: సీఎం జగన్‌ సలహాదారు అజేయ కల్లం తీరుపై సీబీఐ అసహనం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 4:49 PM IST

Updated : Sep 16, 2023, 5:57 PM IST

CBI_Counter
CBI_Counter

16:43 September 16

హైకోర్టులో సీఎం జగన్ సలహాదారు అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటర్

CBI Counter on Petition of CM Jagan Advisor Ajeya Kallam: వివేకా హత్య కేసులో సీఎం జగన్ ప్రధాన సలహాదారు అజేయకల్లం.. సీబీఐ ప్రతిష్టను, ప్రాసిక్యూషన్​ను దెబ్బతీసే దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారని సీబీఐ మండిపడింది. సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందన్న అజేయకల్లం పిటిషన్​పై హైకోర్టులో కౌంటరు దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. విచారణను ఆడియో రికార్డింగు చేసినట్లు వెల్లడించింది. కేసులో మరికొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అజేయకల్లం ఆరోపణలు ప్రేరేపితంగా సీబీఐ అభివర్ణించింది. అజేయకల్లం ప్రభావితమయ్యారన్న సీబీఐ.. ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ఆ పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారే ఇలా వెనక్కి తగ్గితే.. నిందితుల ప్రభావమున్న ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర సాక్షుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేసింది.

వివేకా హత్య కేసులో(Viveka murder case) విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుడు అజేయ కల్లం తీరుపట్ల సీబీఐ అసహనం వ్యక్తం చేసింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించిందని.. హత్యకు సంబంధించిన సమాచారం విషయంలో జగన్​ను భారతి పైకి పిలిచినట్లు తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా నమోదు చేసిందంటూ అజేయకల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసింది. అజేయకల్లం చెబుతున్న విషయాలను అబద్ధమని కొట్టివేసిన సీబీఐ.. విచారణ ఆడియో రికార్డింగు చేసినట్లు వెల్లడించింది. కౌంటరుతో అజేయ కల్లం విచారణ ఆడియో రికార్డింగులను సీల్డు కవర్​లో హైకోర్టుకు సీబీఐ సమర్పించింది.

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case: జగన్​ తమ్ముడికి ఒక రూల్​.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా!

అజేయకల్లం పిటిషన్(Ajeya Kallam Petition) విచారణార్హమే కాదని కౌంటరులో సీబీఐ పేర్కొంది. అజేయకల్లం ఐఏఎస్​గా రిటైరయినప్పటి నుంచి ఇప్పటి వరకూ వాంగ్మూలం నమోదు చేసినప్పుడు కూడా సీఎం జగన్ ప్రధాన సలహాదారుడేనని సీబీఐ ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వంతో తన అనుబంధాన్ని పిటిషన్​లో అజేయ కల్లమే ఒప్పుకున్నారని తెలిపింది. అజేయ కల్లం ప్రభావితమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసిన సీబీఐ.. పిటిషన్​లో పేర్కొన్నఅంశాలను తర్వాత వచ్చిన ఆలోచనలేనని వ్యాఖ్యానించింది. తర్వాత వచ్చిన ఆలోచనలతో అజేయ కల్లం వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొంది. తన వాంగ్మూలంతో కొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అజేయకల్లం ఆరోపణలు ప్రేరేపితం, కల్పితమని సీబీఐ మండిపడింది. వివేకా హత్యలో అమాయకులను ఇరికించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని.. ఛార్జిషీట్లు వేసినట్లు వెల్లడించింది. వివేకా హత్య కేసులో దర్యాప్తును స్వేచ్ఛగా, పారదర్శకంగా చేసినట్లు పేర్కొన్న సీబీఐ.. అజేయకల్లంతో పాటు పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు వివరించింది.

YS Vivekananda Reddy murder case Updates: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌

వివేకా హత్య కేసులో అజేయకల్లంను సాక్షిగా విచారణ జరిపినట్లు సీబీఐ తెలిపింది. అజేయకల్లం అంగీకారంతోనే ఆయన ఇంట్లోనే ఏప్రిల్ 24న సీఆర్ పీసీ వాంగ్మూలం నమోదు చేసినట్లు పేర్కొంది. చట్టప్రకారమే వాంగ్మూలం నమోదు చేసి అజేయకల్లంకు చదివి వివరించామని తెలిపింది. అజేయకల్లం చెప్పిన ప్రతీ అక్షరాన్నీ నమోదు చేశామని వాంగ్మూలంలో అవసరమైన చోట్ల ఆయనే కొన్ని సవరణలు కూడా చేయమన్నారని సీబీఐ వివరించింది. వాంగ్మూలంలో వాస్తవాలు నమోదు చేసినట్లు అజేయకల్లం సంతృప్తి చెందారని తెలిపింది. ఐఏఎస్ అధికారిగా రిటైరైన అజేయకల్లంకు సీఆర్ పీసీ 161 వాంగ్మూలం ఉద్దేశమేంటో తెలుసునని సీబీఐ ప్రస్తావించింది. దర్యాప్తు అధికారిపై అజేయకల్లం ఆరోపణలు అబద్ధమని సీబీఐ ఖండించింది. కేసు ప్రాసిక్యూషన్​ను, సీబీఐ ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతో అజేయకల్లం ఈ పిటిషన్ వేశారని ఆరోపించింది. ఇతర సాక్షుల్లో అనుమానాలు రేకెత్తించేలా అజేయకల్లం ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. మాజీ సీనియర్ బ్యూరోకాట్​గా దర్యాప్తు, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని చూపాల్సిన అజేయకల్లం.. నేర న్యాయ విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆక్షేపించింది. మాజీ సీనియర్ బ్యూరోకాటైన అజేయకల్లం నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదని సీబీఐ వ్యాఖ్యానించింది.

Viveka Murder Case Updates: వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి, ఉదయ్‌ కీలక పాత్ర.. బెయిల్ మంజూరు చేయొద్దన్న సీబీఐ

ట్రయల్ సమయంలో కోర్టులో అజేయకల్లం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు కానీ ఇలాంటి ఆరోపణలతో పిటిషన్ వేసేందుకు ఇది తగిన సమయం కాదని కౌంటరులో సీబీఐ పేర్కొంది. ట్రయల్ సమయంలో అజేయకల్లంను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ధిక్కార ధోరణికి తగిన పరిణామాలకు అజయకల్లం బాధ్యత వహించాల్సి ఉంటుందని సీబీఐ హెచ్చరించింది. తన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని అజేయకల్లం కోరడం ప్రాసిక్యూషన్​ను పక్కదారి పట్టించడమేనని సీబీఐ పేర్కొంది. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారే వెనక్కి తగ్గితే.. నిందితుల తీవ్ర ప్రభామున్న ప్రాంతాల్లో నివసిస్తున్న సాధారణ సాక్షుల పరిస్థితి ఏమిటని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రయల్ ప్రారంభం కాకముందే రాజ్యాంగ కోర్టులైన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో సాక్షులు వెనక్కి తగ్గితే క్రిమినల్ జస్టిస్ సిస్టం అపహాస్యమవుతుందని సీబీఐ పేర్కొంది. అజేయకల్లం పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టును సీబీఐ కోరింది.

Last Updated :Sep 16, 2023, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.