ETV Bharat / bharat

మారిన ఏపీ 'ఆర్థిక' చిత్రం.. ఆదాయం తక్కువ.. అప్పులు ఎక్కువ

author img

By

Published : Mar 4, 2023, 7:43 AM IST

CAG REPORT
CAG REPORT

CAG REPORT ON AP REVENUE : ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక పరిస్థితులు అదుపు తప్పాయని కాగ్ నివేదిక మరోసారి రుజువు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 65 శాతమే ఆదాయం సమకూరగా.. అంచనాల కన్నా 16 శాతం అధికంగా రుణాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ లోటు 181శాతంగా ఉందని తేలింది. ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పిన దానికి, వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే ఉండటం లేదనే విషయం తేటతెల్లమైంది.

CAG REPORT ON AP REVENUE : ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక చిత్రం అంచనాలు తప్పిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లోనే తేటతెల్లమైంది. జనవరి చివరాఖరు ముగిసిన పది నెలలకు రాష్ట్రం సమర్పించిన లెక్కలను కాగ్ వెల్లడించింది. దీని ప్రకారం రాబడి తగ్గుతుండగా..అంచనాలకు మించి అప్పులు పెరిగిపోతున్నాయి.

రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాదిలో సంవత్సరం మొత్తం మీద లక్షా 91వేల 225కోట్ల రూపాయల రాబడి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేసింది. కానీ తొలి పది నెలల్లో వచ్చింది మాత్రం లక్షా 24 వేల108 కోట్లు మాత్రమే. మొత్తంగా 64.8 శాతమే రాబడి వచ్చినట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది. మరో రెండు నెలల్లో వంద శాతం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంచనాలకు తగ్గట్టుగా రెవెన్యూ రాబడి రావాలంటే ఇప్పటికే దాదాపు 83 శాతం మేర వచ్చి ఉండాలి.

అదే సమయంలో అప్పులు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 48వేల 724 కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుంటామని ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పింది. కానీ తొలి 10 నెలల్లోనే అనుకున్న దానికన్నా 16 శాతం అధికంగా అప్పు చేశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రుణం లెక్కలు తేలాలి. ఇప్పటికే కేంద్రం నుంచి అదనపు రుణ పరిమితులు సాధించారు. కార్పొరేషన్ల రుణాలు జత చేయకుండానే రాష్ట్ర రుణం 56వేల 892 కోట్ల రూపాయలకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణాలు సమీకరించిందో సమాచారం వెల్లడించడం లేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల్లో కార్పొరేషన్ల రుణాలు లేవు. పబ్లిక్ అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న మొత్తాల వివరాలు కూడా సమగ్రంగా వెల్లడించలేదని కాగ్ చెబుతోంది. అవన్నీ కలిపితే అప్పుల లెక్క ఇంకా చాలా ఉంటుంది. ఆ రుణాల ద్వారా చేసిన రెవెన్యూ ఖర్చులను పరిగణన లోకి తీసుకుంటే రెవెన్యూ లోటూ మరింత పెరిగిపోనుంది.

రాష్ట్రంలో రెవెన్యూలోటూ భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 వేల36 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ మొదటి పది నెలల్లోనే అది 47వేల 965కోట్లుగా లెక్కతేలింది. అంటే.. అంచనాలకు మించి 181.51 శాతం అదనపు రెవెన్యూ లోటు ఏర్పడింది. అదే సమయంలో మూలధన వ్యయం మరీ తక్కువగా ఉంది. ఆర్థిక ఏడాది 30వేల 679 కోట్ల మేర మూలధన వ్యయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తొలి 10న నెలల్లో 7వేల387 కోట్లకే.. అంటే సుమారు నాలుగోవంతుకే పరిమితం చేసింది.

మారిన ఏపీ ఆర్థిక చిత్రం.. ఆదాయం తక్కువ.. అప్పులు ఎక్కువ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.