ETV Bharat / bharat

భాజపా సీఈసీ భేటీలో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు!

author img

By

Published : Mar 3, 2021, 5:40 AM IST

BJP CEC to meet on March 4 as party gears up for Assembly elections
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల ఖరారు!

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఈ సమావేశంలోనే ఖరారు చేస్తారని పేర్కొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పాయి.

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) గురువారం సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలోనే బంగాల్​, అసోం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నాయి. జాబితాలో చోటు దక్కని వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పదవులు వచ్చేలా చూస్తామని అదిష్ఠానం హామీ ఇవ్వనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

ఎన్నికల బరిలో సరైన అభ్యర్థులను నిలిపే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెప్పాయి. పోటీ చేసే ఒక్కో అసెంబ్లీ స్థానానికి కనీసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను అదిష్ఠానానికి సిఫారసు చేసినట్లు పేర్కొన్నాయి. తుది ఎంపిక సీఈసీ చేతుల్లోనే ఉందని చెప్పాయి. కొత్త వారి కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సూచనప్రాయంగా తెలిపాయి.

బంగాల్​, అసోంపై ప్రత్యేక దృష్టి..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్​లో 20 ర్యాలీలు, అసోంలో 6 బహిరంగ సభలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని భాజపా నేతల కోరిక మేరకు పలు ర్యాలీలకు మోదీ వస్తారని సమాచారం.

బంగాల్​లోని 23 జిల్లాలు, అసోంలోని 33 జిల్లాలవ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహించేందుకు కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. "ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించాల్సి ఉంది. కానీ.. బంగాల్, అసోంలపై భాజపా మరింత దృష్టి పెట్టింది." అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మేరకు మార్చి 7న కోల్​కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్​లో జరగనున్న భారీ ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్​లో మోదీ హాజరుకానున్న మొదటి ర్యాలీ ఇదే కానుంది.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు 3 దశల్లో పోలింగ్​ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడుతాయి.

ఇదీ చూడండి: దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.