ETV Bharat / bharat

చౌకైన ఆ మూడు కొవిడ్‌-19 ఔషధాలు ఏంటి?

author img

By

Published : Jul 15, 2020, 10:26 PM IST

Parl panel demands capping of COVID medicine prices
చౌకైన ఆ మూడు కొవిడ్‌-19 ఔషధాలు ఏంటి?

కరోనా నివారణకు వినియోగించే ఔషధాలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రభుత్వానికి సూచించింది. తక్కువ ధరవి ప్రోత్సహించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కువ ధరవి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్యానెల్​ ప్రశ్నించినట్లు సమాచారం.

కొవిడ్‌-19 ఔషధాలు నల్లబజారుకు తరలిపోకుండా అడ్డుకోవాలని హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రభుత్వానికి సూచించింది. సమర్థంగా పనిచేస్తూ చౌకగా లభిస్తున్న మందులు కాకుండా ఎక్కువ ధరవి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

'కొవిడ్‌-19 చికిత్స కోసం స్వదేశంలో తయారైన, చౌకైన ఔషధాల్ని ప్రోత్సహించాలి. ఫార్మా కంపెనీలు చెబుతున్న ఖరీదైన మందుల ప్రోత్సాహానికి అడ్డుకట్ట వేయాలి.' అని కమిటీలోని ఒక సభ్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారని తెలిసింది. అంతేకాకుండా మందుల ధరలకు పరిమితి విధించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా కమిటీలోని సభ్యులందరూ తక్కువ ధర ఔషధాలను ప్రోత్సహించాలని కోరారని సమాచారం.

నల్ల బజారుకు తరలించడం, కృత్రిమ కొరత గురించి కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. మూడు ఔషధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందని తెలిసింది. చౌకగా లభిస్తూ సమర్థంగా పనిచేస్తున్న ఆ మూడు మందుల్ని కాకుండా ఎక్కువ ధరవి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది. కాగా వారు ప్రస్తావించిన డ్రగ్స్‌ వివరాలు బయటకు రాకపోవడం గమనార్హం.‌

ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్ల బజారులో విక్రయించకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు ప్రభుత్వ అధికారులు కమిటీకి తెలిపారు. కొవిడ్‌-19 మరణాల రేటును 1% కన్నా దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తక్కువ ధర ఔషధాల విక్రయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించామని వెల్లడించారు.

ఇదీ చూడండి: టీవీ చూసే విషయంపై గొడవ- బాలిక దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.