ETV Bharat / bharat

పుల్వామా దాడి: పాక్​లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ

author img

By

Published : Aug 26, 2020, 1:25 PM IST

NIA reveals JeM had another suicidal attack planned
అఫ్గాన్‌లో శిక్షణ.. పాక్‌‌లో వ్యూహం

పుల్వామా ఘటనకు సంబంధించి పాకిస్థాన్​లో జరిగిన కుట్రనంతా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అభియోగ పత్రంలో వివరించింది. 2016-17లో జైషే మహమ్మద్​కు వచ్చిన కారు బాంబు దాడి ఆలోచనతో.. అదును చూసి భారత్​లోకి అడుగుపెట్టారు ఉగ్రవాదులు. ఈ బృందం భారత్‌ వచ్చాక జైషే మహమ్మద్‌ అగ్రనాయకత్వం‌ ప్రత్యేకంగా వీరితో 'టచ్‌'లో ఉంది. ఆపరేషన్‌ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని.. ఆ వివరాలన్నింటినీ ఛార్జిషీట్​లో పేర్కొంది ఎన్​ఐఏ.

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి పాకిస్థాన్‌లో ఏ స్థాయి కుట్ర జరిగిందో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఛార్జిషీట్‌ కళ్లకు కట్టింది. ఈ తరహా కారు బాంబులు సిరియా, అఫ్గానిస్థాన్‌ వంటి రణ భూముల్లోనే వాడుతుంటారు. దీంతో నిందితులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. ఈ బృందం భారత్‌ వచ్చాక జైషే మహమ్మద్‌ టాప్‌ లీడర్‌షిప్‌ ప్రత్యేకంగా వీరితో 'టచ్‌'లో ఉంది. ఆపరేషన్‌ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని తేల్చింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ తన 13,800 పేజీల ఛార్జిషీట్‌లో ఫొటో, ఇతర ఆధారాలతో సహా పూసగుచ్చినట్లు పేర్కొంది.

పాకిస్థాన్‌లో పురుడు పోసుకున్న కుట్ర

కశ్మీర్‌లో కారు బాంబుతో భారీ ఉగ్రదాడి చేయాలని 2016-17లోనే జైషే మహమ్మద్‌ నిర్ణయించుకోగానే ఓ బృందాన్ని సిద్ధం చేసింది. మహమ్మద్‌ ఉమర్‌ అనే ఉగ్రవాదిని కారు బాంబుల తయారీలో నిపుణులు ఉన్న అఫ్గాన్‌కు పంపి శిక్షణ ఇప్పించింది. ఈ బృందాన్ని మెల్లిగా సాంబ-కథువా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న షకారఘ్రలోని ఉగ్రలాంచ్‌ ప్యాడ్స్‌కు చేర్చింది. అక్కడి నుంచి అదును చూసి ఉమర్‌తోపాటు మరో ముగ్గురు భారత్‌లోకి చొరబడ్డారు. వీరు ఐఈడీలతో భద్రతా దళాలపై దాడి చేయడానికి స్థానికులు సాయం చేశారు.

ఆ కారుతోనే దాడి..

ఉగ్రవాదులు భారత్‌లో ఉండటానికి.. వారిని ఘటనా ప్రదేశానికి తరలించడానికి నలుగురు సాయం చేశారు. ఈ క్రమంలో వీరిలో కొందరు ఉగ్రవాదులకు తమ ఇళ్లలోనే ఆశ్రయం ఇవ్వగా.. మరికొందరు శ్రీనగర్‌- జమ్ము జాతీయ రహదారిపై దళాల కదలికలపై నిఘా వేసి సమాచారం సేకరించారు. షకీర్‌ బషీర్‌ తన ఇంట్లో ఆర్‌డీఎక్స్‌, జిలిటెన్‌ స్టిక్స్‌, పేలుడు పదార్థాలను భద్రపర్చాడు.

2019 జనవరిలో సజ్జాద్‌ అహ్మద్‌ భట్‌ కారును కొనుగోలు చేశాడు. ఈ కారుతోనే ఐఈడీ దాడి చేశారు. మిగిలిన వారు దాడి అనంతరం విడుదల చేయడానికి అవసరమైన ప్రచార వీడియోను చిత్రీకరించారు. దీనికి ఇన్షాజాన్‌ అనే వ్యక్తి ఇంటిని వాడుకొన్నారు.

ఐఈడీలతో..

ఫిబ్రవరి తొలివారంలో 160 కిలోలు, 40 కిలోల బరువున్న రెండు ఐఈడీలను సిద్ధం చేసుకొన్నారు. వీటికోసం పాక్‌ నుంచి వివిధ రూపాల్లో తరలించిన సామగ్రిని వాడుకొన్నారు. ఆ తర్వాత సజ్జాద్‌ కొనుగోలు చేసిన కారులో వీటిని అమర్చారు.

ఫిబ్రవరి 14న జాతీయ రహదారి తెరవగానే షకీర్‌ బషీర్‌ కారును బయటకు తీసి.. ఆదిల్‌ అహ్మద్‌దార్‌(ఫిదాయి)ను ఎక్కించుకొని జాతీయ రహదారివైపు పయనమయ్యాడు. వెంటనే సమీపంలో కారును దార్‌కు అప్పగించాడు. అక్కడి నుంచి బయల్దేరిన దార్‌ సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేశాడు. దాడి తర్వాతి రోజుల్లో భద్రాతా దళాలు పలువురు కీలక సూత్రధారులను ఎన్‌కౌంటర్‌లలో మట్టుబెట్టాయి.

బిలాల్‌ అరెస్టుతో వీడిన గుట్టు..

జులై ఐదో తేదీన కాకాపోరాలోని హిజిబాల్‌కు చెందిన బిలాల్‌ అహ్మద్‌ను అరెస్టు చేశారు. అతను స్థానికంగా ఓ రంపపు మిల్లును నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం, వారిని తరలించడానికి బిలాల్‌ సహకరించాడు. దీంతోపాటు ఉగ్రవాదులకు స్థానికంగా జైషే సానుభూతి పరులను పరిచయం చేశాడు.

ఆ మొబైల్‌తో బలమైన ఆధారాలు..

ఈ కుట్రను పూర్తిగా బయటపెట్టడానికి ఓ మొబైల్‌ ఫోన్‌ సహకరించింది. పుల్వామా దాడి తర్వాత నెల రోజుల్లో మహమ్మద్‌ ఉమర్‌ ఫరూఖ్‌ను సైన్యం మట్టుబెట్టింది. ఈ క్రమంలో అతని మొబైల్‌ ఫోన్‌ దళాల చేతికి చిక్కింది. దానిని విశ్లేషించి కీలకమైన ఫొటోలు, వాట్సాప్‌ సంభాషణలు, వీడియో క్లిప్‌లను వెలికి తీసింది. ఈ దాడి సమయంలో జైషే టాప్‌ లీడర్స్‌ మసూద్‌ అజర్‌, రవూఫ్‌ అస్ఘర్‌, అమ్మార్‌ అల్వీ( ఛోటా మసూద్‌)లు నిందితులతో టచ్‌లో ఉన్నట్లు తేలింది. వారే పాక్‌ నుంచి సూచనలు ఇచ్చినట్లు గుర్తించింది.

మరో దాడిని అడ్డుకొన్న 'బాలాకోట్‌'

పుల్వామా దాడి తర్వాత మరో కారు బాంబును కూడా కశ్మీర్‌లో వాడాలని ప్లాన్‌ వేశారు. కానీ.. అఫ్గానిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉమర్‌ మరణించడం, భారత్‌ బాలాకోట్‌లో జైషే క్యాంప్‌పై దాడి చేయడం వల్ల వారు తమ పథకాలను ఉపసంహరించుకొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: యువ కశ్మీరాలు: కష్టాలను ఎదిరించి లక్ష్యాల వైపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.