ETV Bharat / bharat

సుదూరంలోని గెలాక్సీని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

author img

By

Published : Sep 2, 2020, 10:49 AM IST

Indian astronomers discover 'one of the farthest' star galaxies in universe
భారత శాస్త్రవేత్తల ఆవిష్కరణ- నాసా అభినందన

భారత ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. విశ్వంలో 930 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గెలాక్సీని కనుగొన్నారు. ఆస్ట్రోశాట్ ఉపగ్రహం ద్వారా దీన్ని గుర్తించారు. ఈ గెలాక్సీ పేరు 'ఏయూడీఎఫ్​ఎస్​01' అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ఆవిష్కరణ పట్ల నాసా సైతం హర్షం వ్యక్తం చేసింది. ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలను అభినందించింది.

విశ్వంలో అత్యంత దూరంలో ఉన్న నక్షత్రాల సమూహాన్ని(గెలాక్సీ) భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి నుంచి 930 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీలు ఉన్నట్లు అంచనా వేశారు. ఆస్ట్రోశాట్ శాటిలైట్ ద్వారా దీన్ని గుర్తించినట్లు భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ తెలిపింది. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించింది.

"భారత ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలోని అత్యంత సుదూర నక్షత్ర సమూహాన్ని గుర్తించారు. భారత అంతరిక్ష మిషన్లలో కీలక మైలురాయి."

-అంతరిక్ష శాఖ, భారత ప్రభుత్వం

భారత్​కు గర్వకారణం

పుణెకు చెందిన ఇంటటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్(ఐయూసీఏఏ)​కు చెందిన డా. కనక్ సాహా బృందం 'ఏయూడీఎఫ్​ఎస్​01' అనే గెలాక్సీని కనుగొన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత శాస్త్రవేత్తల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి భారత్ పంపిన తొలి మల్టీ వేవ్​లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ- 'ఆస్ట్రోశాట్' ఉపగ్రహం 930 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని యూవీ కిరణాలను గుర్తించడం అద్భుతమని కొనియాడారు. ఇది భారత్​కు గర్వకారణమని అన్నారు.

నాసా అభినందన

ఈ అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ శాస్త్రవేత్తల ఘనతను అమెరికా జాతీయ వైమానిక, అంతరిక్ష పరిపాలన సంస్థ(నాసా) కొనియాడింది. ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులను అభినందించింది.

"సైన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా సహకారంతో కూడిన ప్రయత్నాలే. ఇలాంటి ఆవిష్కరణలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఒంటరిగానే ఉన్నామా(ఇతర గ్రహాల్లో జీవం ఉందా అన్న కోణంలో) అనే ప్రశ్నలను అర్థం చేసుకునేందుకు మానవజాతికి ఉపయోగపడతాయి."

-ఫెలీసియా చౌ, ప్రజా వ్యవహారాల అధికారి, నాసా

కాంతిని గుర్తించేందుకు కీలకం

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బ్రిటన్​కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'నేచర్ ఆస్ట్రానమీ'లో ప్రచురితమయ్యాయి. ఈ ఆవిష్కరణ విశ్వంలో చీకటి యుగాలు ఎలా ముగిసిపోయాయన్న విషయంతో పాటు విశ్వంలో కాంది ఉందన్న విషయంపై కీలకమైన ఆధారంగా మారుతుందని ఐయూసీఏఏ డైరెక్టర్ డా. సోమర్ రాయ్ చౌధురీ పేర్కొన్నారు. ఈ కాంతి ఎక్కడి నుంచి మొదలైందో కనుక్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే కాంతి ప్రారంభమైన వనరు గుర్తించడం చాలా కష్టతరమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి- అమెరికా ఎన్నికలకు ముందు ఆస్టరాయిడ్ ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.