ETV Bharat / bharat

'లేఖ ఓ కుట్ర.. పార్టీ అధ్యక్షుడు రాహులే'

author img

By

Published : Aug 29, 2020, 4:29 PM IST

Updated : Aug 29, 2020, 5:45 PM IST

Dissent letter conspiracy against Rahul: Sanjay Nirupam
'అసమ్మతి లేఖ ఓ కుట్ర.. రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడు'

పార్టీలో సంస్థాగత ప్రక్షాళన, పూర్తిస్థాయి అధ్యక్షుడి ఎన్నిక అంశాలతో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్లు రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు.. ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శశి థరూర్​, ఆజాద్, జితిన్​ ప్రసాద్​ వంటి నాయకులపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో పరిస్థితుల గురించి పలు విషయాలు వెల్లడించారు కాంగ్రెస్​ నేత సంజయ్​ నిరుపమ్​. ​

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు కావాలని కోరుతూ 23 మంది అసమ్మతివాదులు లేఖ రాయడంపై విమర్శలు గుప్పించారు ఆ పార్టీ సీనియర్​ నేత సంజయ్​ నిరుపమ్​. అది రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా చేస్తున్న ఓ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ అంశాలపై 'ఈటీవీ భారత్'​ సీనియర్​ జర్నలిస్ట్​ అగ్నిహోత్రికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: కాంగ్రెస్​లో నాయకత్వ మార్పు అవసరమనే అంశం ఎందుకు తెరపైకి వచ్చింది?

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి నాయకత్వ సమస్య చర్చనీయాంశమైంది. రాహుల్​ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగడానికి నిరాకరించారు. గాంధీయేతర వ్యక్తి పార్టీకి నాయకత్వం వహించాలని ఆయన సూచించారు. ఆ వ్యక్తి ఎంపిక కోసం అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ లోపే సోనియా గాంధీని తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కొందరు కోరారు. అప్పటి నుంచే తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది.

ప్రశ్న: పూర్తిస్థాయి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తి కోసం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నాయకులు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాశారు. మీరు దాన్ని ఓ కుట్రగా అభివర్ణించారు.. ఎందుకు?

అదిష్ఠానం ఎదుట సమస్యను ప్రస్తావించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ రాజకీయ పార్టీకైనా తమ వ్యవహారాలను చూసుకునేందుకు పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడు అవసరం. అయితే కొంతమంది సీనియర్ నాయకులు రాసిన లేఖ.. కాంగ్రెస్, గాంధీలను అస్థిరపరిచే కుట్రలో భాగమని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇటువంటి కుట్రలు గతంలో జరిగాయి. దిల్లీలో కొంతమంది ఇతర పార్టీ నాయకుల నివాసాలు, కార్యాలయాల వద్ద వీటిపై చర్చలు జరిగాయి. ఈ అసమ్మతివాదులు రాసిన లేఖ కుట్ర కోణాన్ని బయటపెట్టింది. పార్టీ కార్యకర్తగా ఈ సమయంలో అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్నికలు అవసరం లేదనేది నా అభిప్రాయం.

'లేఖ ఓ కుట్ర.. పార్టీ అధ్యక్షుడు రాహులే'

ప్రశ్న: ఎన్నికలు వద్దని ఎందుకు అంటున్నారు..? ఏదైనా కారణముందా?

ఇలాంటి ఎన్నికలు పార్టీలో అనేక వర్గాలను సృష్టిస్తాయి. ఎన్నికల ఫలితాలు పార్టీ నాయకులలో అసంతృప్తిని రగిలించి.. కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు దారితీయొచ్చని నా అభిప్రాయం. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన సమయంలో వీటి ప్రస్తావన అనవసరం.

ప్రశ్న: పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం?

ఏ ప్రజాస్వామ్య సంస్థలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత పార్టీ ఎన్నికలు ఉండాలి. కానీ నేను విమర్శకులను ఒక్కటే అడగాలనుకుంటున్నాను. ఎన్ని ఇతర రాజకీయ పార్టీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. మమ్మల్ని ప్రశ్నించే ఇతర పార్టీలలో ఇలాంటి వ్యవస్థలే లేవు. ఎన్నికల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎంతమంది గెలిచారని నేను కూడా అడగాలనుకుంటున్నాను. వారు పార్టీని బలమైన ప్రతిపక్షంగా బలోపేతం చేయాలి కాని పార్టీని విభజించి బలహీనపరిచే సమస్యలను ఎత్తిచూపకూడదు.

ప్రశ్న: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్తోందా?

రాహుల్​ పోటీ చేస్తే సునాయసంగా గెలుస్తారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి పార్టీ యువజన విభాగాల్లో.. అధ్యక్ష పదవికి రాహుల్​ సరైన వ్యక్తి అనే అభిప్రాయం ఉంది. ఈ విషయంపై మీరు యువజన విభాగంలో అభిప్రాయ సేకరణ నిర్వహించుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అని ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్​ తరఫున ఎన్నికైన ముఖ్యమంత్రులు, పార్టీ కార్యకర్తల మెజార్టీ అభిప్రాయం అడగవచ్చు. ఇలాంటి సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఎవరైనా పట్టుబడుతుంటే మాత్రం అది పార్టీకి మంచిదని నేను అనుకోను. అలాంటి వ్యతిరేక పోరు ఎదైనా ఉంటే ఫలితం మాత్రం రాహుల్​కు అనుకూలంగానే ఉంటుంది.

ప్రశ్న: ప్రస్తుతం కాంగ్రెస్​ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏంటి..?

18 నెలలుగా దేశవ్యాప్తంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చే పూర్తిస్థాయి అధ్యక్షుడు లేరు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కానీ వారంతా ఈరోజు చెల్లాచెదురుగా ఉన్నారు. మేము వారిని శక్తివంతం చేయాలి. కాంగ్రెస్‌తో పోల్చితే అధికార భాజపా చాలా బలంగా తయారైంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన సమయం ఇది. రాహుల్​ పార్టీ చీఫ్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించాక.. కార్యకర్తలను చైతన్యపరిచేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు నిర్వహించాలి.

ప్రశ్న: మరి ఇవన్నీ ఎప్పటిలోగా పూర్తవుతాయి.?

ఆగస్టు 24న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెషన్​ను ఆరు నెలల్లో నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి-ఏప్రిల్ 2021 నాటికి నాయకత్వం సహ కీలక విభాగాల ఎన్నికలకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నా. పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతారని అనుకుంటున్నా.

Last Updated :Aug 29, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.