ETV Bharat / bharat

అధ్వానంగా ఆఫ్​సెట్​ విధానం.. అందని ప్రతిఫలం

author img

By

Published : Sep 24, 2020, 8:10 AM IST

Dassault Aviation, MBDA yet to fulfil offset obligations under Rafale deal: CAG
అధ్వానంగా ఆఫ్​సెట్​ విధానం

విదేశీ సంస్థలతో భారత్​ అనుసరిస్తున్న ఆఫ్​సెట్​ విధానంపై నివేదికను వెల్లడించింది కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​). ఆయా సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతికతల బదిలీలో దేశ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ఈ మేరకు తన నివేదికను పార్లమెంట్​కు సమర్పించింది కాగ్​.

విదేశీ సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి మన దేశం అనుసరిస్తున్న ఆఫ్​సెట్​ విధానంపై కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​) పెదవి విరిచింది. ఆయా సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతికతల బదిలీలో అది విఫలమవుతోందని పేర్కొంది. రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా ఫ్రాన్స్​ సంస్థ దసో ఏవియేషన్​, ఐరోపా క్షిపణుల తయారీసంస్థ ఎంబీడీఏ నుంచి ఇంకా సాంకేతికత మన దేశానికి అందలేదని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు కాగ్​ బుధవారం సమర్పించింది.

దసో ఏవియేషన్​ రఫేల్​ యుద్ధ విమానాల తయారీ సంస్థ కాగా.. ఆ విమానాలకు క్షిపణి వ్యవస్థలను ఏంబీడీఏ సరఫరా చేసింది. భారత ఆఫ్​సెట్​ విధానం ప్రకారం.. మన దేశంతో ఒప్పందం కుదుర్చుకునే విదేశీ సంస్థలు, విక్రయదారులు ఆ ఒప్పందం మొత్తం విలువలో 30శాతాన్ని తప్పనిసరిగా భారత్​లోనే ఖర్చు చేయాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ), సాంకేతికత బదిలీ వంటి మార్గాల్లోనూ ఆ ప్రతిఫలాన్ని అందజేయవచ్చు.

అందని ప్రయోజనం

"రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ)కు ఆధునిక సాంకేతికతను బదిలీచేయడం ద్వారా రూ.59వేల కోట్ల రఫేల్​ ఒప్పందానికి సంబంధించిన 'ఆఫ్​సెట్​' బాధ్యతను నెరవేరుస్తామని దసో ఏవియేషన్​, ఎంబీడీఏ హామీ ఇచ్చాయి. దీంతో తేలికపాటి యుద్ధ విమానాలకు అవసరమైన కావేరీ ఇంజిన్​ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ప్రతిఫలంగా పొందాలని డీఆర్​డీఓ భావించింది. అయితే.. ఇప్పటివరకూ ఆ ప్రయోజనం అందనే లేదు." అని కాగ్​ తెలిపింది. ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా విదేశీ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలు మన ఆఫ్​సెట్​ విధానంలో లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగ్​ నివేదిక ఏం చెప్పిందంటే..

2005 నుంచి 2018 మార్చి మధ్య విదేశీ విక్రయదారులతో 48 ఆఫ్​సెట్​ కాంట్రాక్టులు కుదిరాయి. వాటి విలువ రూ.66,427 కోట్లు. అందులో రూ.19,223 కోట్ల విలువైన ప్రయోజనాలు 2018 డిసెంబర్​లోగా మన దేశానికి అందాలి. కానీ.. రూ.11,396 కోట్లు మాత్రమే దక్కాయి.

  • దేశంలోని మొత్తం 63 రంగాలకు గానూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందడంలో రక్షణ రంగం 62వ స్థానంలో ఉంది.
  • వాయుసేనకు చెందిన 90 'ఎంఐ-17' హెలికాప్టర్లను మెరుగుపర్చే ప్రక్రియ(అప్​గ్రెడేషన్​)లో తీవ్ర జాప్యం జరగడం వల్ల రక్షణ శాఖను కాగ్​ విమర్శించింది. 2002లోనే ఈ అప్​గ్రెడేషన్​ను ప్రతిపాదించినా ఇప్పటికీ పూర్తికాకపోవడమేంటని పెదవి విరిచింది.
  • సముద్ర మార్గాల్లో బలగాలు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను తరలించేందుకుగానూ 4 'ల్యాండింగ్​ ప్లాట్​ఫాం డాక్​(ఎల్​పీడీ)'లను సముపార్జించుకోవాలని 2010లోనే నిర్ణయించినా, ఇప్పటికీ నౌకాదళం వాటిని పొందలేకపోయిందంటూ కాగ్​ విమర్శలు గుప్పించింది.

ఆ కేంద్రం స్థాపనతో జరిగింది శూన్యం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అంతర్జాతీయ అడ్వాన్స్​డ్​ రీసెర్చ్​ సెంటర్​ ఫర్​ పౌడర్​ మెటలర్జీ స్థాపించిన 'సిలికాన్​ కార్బైడ్​ మిర్రర్​ డెవలప్​మెంట్​ కేంద్రం' అవసరమైన స్థాయి నాణ్యతతో కూడిన అద్దాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైందని కాగ్​ పేర్కొంది. ఆ కేంద్రం స్థాపన, నిర్వహణకు రూ.47.12 కోట్లు వ్యయమైన సంగతిని గుర్తు చేసింది.

ఇదీ చదవండి: ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.