ETV Bharat / bharat

బంగాల్‌లో కేంద్ర బలగాలను దింపాలి: భాజపా

author img

By

Published : Dec 13, 2020, 10:12 PM IST

Kailash Vijayvargiya
బంగాల్‌లో కేంద్ర బలగాలని దింపాలి: భాజపా

బంగాల్​లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు.. సీఎం మమతా బెనర్జీ హింసకు తెరలేపుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలని డిమాండ్​ చేశారు.

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు హింసాత్మక ఘటనల్ని ప్రోత్సహిస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసకు తెరపడాలంటే వెంటనే కేంద్ర బలగాలను దింపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బీర్భూమ్‌లోని శాంతినికేతన్‌ వద్ద ఆదివారం.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి హింసకు తావులేకుండా నిర్వహించాలని ఈసీని కోరాం. బంగాల్‌లో పరిస్థితులు మమతా బెనర్జీ నుంచి చేజారిపోయాయని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తిరిగి అధికారంలోకి రావడానికి హింసకు తెరలేపుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో రాజకీయ హింసకు తెరదించడానికి కేంద్ర బలగాలను దింపాలని నేను ఈసీని కోరాను."

--కైలాశ్‌ విజయవర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

అదేవిధంగా.. డిసెంబర్‌ 22న విశ్వభారతి సెంట్రల్‌ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాట్ల గురించి వీసీ విద్యుత్‌ చక్రవర్తితో కైలాశ్‌ సమీక్షించారు. వర్శిటీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిసెంబర్‌ 24న ఛాన్సలర్‌ హోదాలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. వర్సిటీని 1918 డిసెంబర్‌ 22న రవీంద్రనాథ్ ‌ఠాగూర్‌ స్థాపించారు.

బంగాల్‌లో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల రాళ్ల దాడి జరిగింది. అప్పటి నుంచి భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) నాయకుల మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఘటనపై వివరణ కోరుతూ బంగాల్‌ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. కాగా ఆ నోటీసులను మమతా బెనర్జీ ప్రభుత్వం తిరస్కరించగా.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెనక్కి పిలుస్తూ ఆదేశించింది.

ఇదీ చూడండి:భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.