ETV Bharat / bharat

దేశంలో విస్తరిస్తున్న కరోనా కేసులు- ఎక్కడికక్కడ బంద్!

author img

By

Published : Mar 20, 2020, 7:03 PM IST

corona
దేశంలో విస్తరిస్తున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దేశంలో 223 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి.

దేశంలో కరోనా కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశంలో 223 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం 1075ని సంప్రదించాలని సూచించారు. కరోనాపై పోరాడేందుకు అవసరమైన సౌకర్యాలకు కొరత ఉన్నట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో భారత్​లో వైద్య పరిశోధనలు చేసే ఐసీఎంఆర్ 13,486 రక్తనమూనాలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. అయితే దేశంలో ఉన్న కరోనా బాధితుల్లో 32 మంది విదేశీయులని వెల్లడించింది. మహారాష్ట్రలో 47 కేసులు, కేరళలో 28, హరియాణాలో 17, ఉత్తర్​ప్రదేశ్​లో 19, తెలంగాణలో 16, కర్ణాటకలో 15, లద్దాఖ్​లో 10 , రాజస్థాన్​లో 9 కేసులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ల్లో రెండు కేసుల చొప్పున నమోదైనట్లు స్పష్టం చేసింది.

అదే సమయంలో కరోనాపై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింతలు సవాలుగా తీసుకుని ఉద్యమిస్తున్నాయి.

'కలిసి పనిచేద్దాం..'

వైరస్ నియంత్రణకు కలిసికట్టుగా పోరాడాదమని పిలుపునిచ్చారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఇళ్లల్లోనే ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.

వసుంధర రాజె స్వీయ నిర్బంధం

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె కుమారుడు, భాజపా ఎంపీ దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నారు. కరోనా పాజిటివ్​గా తేలిన ఓ బాలీవుడ్ గాయనిని కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ గాయని ఇచ్చిన విందుకు రాజె, ఆమె తనయుడు హాజరయ్యారు.

కేరళలో ఇద్దరు ఎమ్మెల్యేలు

కేరళలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమను తాము స్వీయ నిర్బంధంలో ఉంచుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిని కలిసిన అనంతరం అతనికి వైరస్ ఉన్నట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జనతా కర్ఫ్యూ- ఆదివారం మెట్రో బంద్

ప్రధాని పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ మెట్రోను బంద్ చేయనున్నారు. ప్రజలను ఇళ్లల్లో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

గుజరాత్​లో బస్సుల నిలిపివేత..

ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో గుజరాత్​లో బస్సులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి విజయ్​రూపానీ. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

కర్ఫ్యూలో భాగమవుదాం..

ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు మధ్యప్రదేశ్ భాజపా సీనియర్ నేత శివరాజ్​ సింగ్ చౌహాన్.

ఇదీ చూడండి: విదేశీయుల వీసాల గడువును పొడగించిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.