ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం.. రోడ్ల మరమ్మత్తులు, రహదారుల విస్తరణ, ఇతర సౌకర్యాల కోట్లు ఖర్చు చేసి తీవ్ర విమర్శలపాలైంది బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ). ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రూ. 23కోట్లతో 14కిలోమీటర్ల మేర రోడ్లు, ఇతర మరమ్మతులు చేశారు బీబీఎంపీ అధికారులు. సోమవారం ప్రధాని మోదీ పర్యటించిన రోజు.. అద్దంలా మెరిసిన రోడ్లు.. బుధవారం నాటికి నామరూపం లేకుండా పోయాయి. రాత్రి కురిసిన ఒక్క వర్షానికి చాలా చోట్ల కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కడం వల్ల.. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. తారు రోడ్డు మరమ్మతులపై సమగ్ర నివేదిక అందజేయాలని బీబీఎంపీని కోరింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది బీబీఎంపీ.
మళ్లీ నిరాశ..
బెంగళూరులో సాధారణంగానే ట్రాఫిక్ సమస్య ఎక్కువ. రహదారులు దెబ్బతినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమైంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా.. రోడ్లను బాగు చేయడంపై అధికారులు దృష్టి సారించలేదు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనతోనైనా.. రోడ్లు బాగుపడ్డాయనుకుని ఆనందపడ్డ బెంగళూరు ప్రజల సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మంగళవారం రాత్రి కురిసిన ఒక్క వర్షంతో మళ్లీ రహదారులు దెబ్బతినగా నిరాశకు గురయ్యారు. మోదీ పర్యటించిన జ్ఞానభారతి మెయిన్‌రోడ్డు మరమ్మతులను రూ.6 కోట్లతో చేపట్టగా.. వర్షానికి ఆ రహదారి మొత్తం పాడైపోయింది. రోడ్లు గంతలమయంగా మారి.. రాళ్లు పైకి తేలడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాహనదారులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
బెంగళూరు రోడ్ల దయనీయ పరిస్థితిపై సాధారణ ప్రజలతో పాటు బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
సీఎం బొమ్మై ఏం అన్నారంటే..
మరమ్మతులు చేసిన రహదారులు పాడవడంపై విచారణ జరపాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. బీబీఎంపీ కమిషనర్‌ను ఆదేశించారు. నిజానిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కొత్త వాటర్ పైప్‌లైన్‌ను అనుసంధానం చేయడం వల్ల ఏర్పడిన లీకేజీ.. రోడ్లు దెబ్బతినడానికి కారణమై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలినట్లు బొమ్మై వెల్లడించారు.
బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ కూడా స్పందించారు. వర్షాల వల్ల కొన్నిచోట్ల తారు రోడ్డు దెబ్బతిన్న మాట వాస్తవమే అని.. అయితే మరమ్మతులు చేసిన రహదారులు మళ్లీ పాడైనట్లు చెప్పడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..