ETV Bharat / bharat

అగ్నిపథ్​ ఉపసంహరణకే పలు రాష్ట్రాలు డిమాండ్​.. ఆగని నిరసనలు!

author img

By

Published : Jun 26, 2022, 6:55 PM IST

agneepath scheme army
అగ్నిపథ్ పథకం

agneepath scheme : సాయుధ బలగాల్లో అగ్నిపథ్ పథకం కింద చేరే యువకుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది. సర్వీసు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కొన్ని భాజపా పాలిత రాష్ట్రాలు ప్రకటించగా, భాజపాయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నాయి.

Agnipath Scheme: సాయుధ బలగాల్లో సైనిక తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' పథకంపై ఆందోళనలు ఆగట్లేదు. ఈ పథకం కింద సైన్యంలో చేరే సైనికుల భవిష్యత్​పై భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భాజపాయేతర పాలిత రాష్ట్రాలు అగ్నివీర్స్ కోసం ఎటువంటి అనుకూలమైన రిక్రూట్​మెంట్​ను ప్రకటించలేదు. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నాయి. అగ్నిపథ్​ను ఉపసంహరించుకోవాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భాజపా అధికారంలో ఉన్న.. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, అసోం వంటి రాష్ట్రాలు.. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో 'అగ్నివీర్'లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించాయి.

అగ్నివీర్​లకు గ్రూప్​ సి పోస్టులు లేదా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉద్యోగాలిస్తామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్​ తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్​లకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారనేది మాత్రం చెప్పలేదు. అదే విధంగా పోలీసు, విపత్తు, చార్ ధామ్ నిర్వహణ విభాగాల్లో అగ్నివీర్​లను తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం యోచిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి పుష్కర్​ సింగ్ ధామీ అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం ప్రభుత్వాలు పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్స్ కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాయి. అయితే ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తాయో ప్రకటించలేదు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్​ నియామకాల్లో అగ్నివీర్స్​కు ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. మరోవైపు సాయుధ దళాలకు గణనీయమైన సంఖ్యలో యువకులను అందిస్తున్న పంజాబ్, రాజస్థాన్​, తమిళనాడు వంటి భాజపాయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

పంజాబ్​లో అధికారంలో ఉన్న ఆప్​ సైతం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని తప్పుపట్టారు. ఈ పథకం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్.. ఇంకా అగ్నివీర్​లకు పోలీసు శాఖలో రిజర్వేషన్లపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్​లకు రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. పోలీసు, అగ్నిమాపక, అత్యవసర సేవలు, అటవీ శాఖ, జైళ్ల శాఖ వంటి సర్వీసుల్లో అగ్నివీర్​లకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సైతం అగ్నివీర్స్​ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), అసోం రైఫిల్స్‌ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు హోంశాఖ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అంతేగాక, ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయో పరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించింది.

అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్​ మండిపడింది. తుగ్లక్​ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేసింది. కొత్త సైనిక నియామక ప్రక్రియ అగ్నిపథ్ ద్వారా మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని విమర్శించింది. కాంగ్రెస్​.. యువతకు అండగా నిలబడతుందని హామీ ఇచ్చింది. అగ్నిపథ్ పథకం బాగుందని చెబుతున్న మంత్రులు, భాజపా నాయకులందరూ తమ కుమారులు, కుమార్తెలను అగ్నిపథ్‌ పథకంలో చేర్పించాలని అన్నారు. కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేతలు మీడియా సమావేశంలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

అగ్నివీర్​లను భాజపా కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామన్న విజయవర్గీయ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని యువతకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికారి ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ డిమాండ్ చేశారు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్‌ హుడా మండిపడ్డారు. ఇదో కాపీ పథకమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొట్టి ఇక్కడ రూపకల్పన చేస్తోందని విమర్శించారు. ఆ పథకాలు ఇక్కడ పరిస్థితులకు సరిపోవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అగ్నిపథ్‌ విషయంలో ఇజ్రాయెల్‌ను కాపీ కొడుతున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి: యూపీలో యోగి మేజిక్.. ఎస్పీ కోటలు బద్దలు.. పంజాబ్​లో ఆప్​కు షాక్

'పార్టీల రిజిస్ట్రేషన్​ రద్దు చేసే అధికారం మాకివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.