ETV Bharat / bharat

స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్

author img

By

Published : Apr 10, 2023, 4:06 PM IST

Tiger
Tiger

అడవికి రారాజు ఎవరు అంటే అంతా చెప్పే సమాధానం సింహం అని. ఆ సింహం తర్వాత స్థానం పులిది. అంతటి గొప్పదనం వ్యాఘ్యానిది. అడవిలో తాను బతకడమే కాదు తన ఆధీన ప్రాంతంలోని అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయకారిగా బతికే ప్రత్యేకత పులి సొంతం. అలాంటి పులిని కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజక్టు టైగర్‌ ఇటీవలే 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ పులుల కూటమిని ప్రారంభించారు. పులుల సంరక్షణ కార్యక్రమానికి చిహ్నంగా రూ.50 నాణేన్ని విడుదల చేశారు. మరి పులులకు ఎందుకింత ప్రాధాన్యత. అసలు ఏమిటీ ప్రాజక్టు టైగర్‌. ఉత్సవాలు చేయాల్సినంత ప్రత్యేకత ఏముంది.

స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్

project tigers: ప్రకృతి మనుగడకు కీలకం జీవ వైవిధ్యం. అన్ని జీవరాశులు సమపాళ్లలో ఉంటేనే ప్రకృతి బాగుంటుంది. అందులో క్రూర మృగాలదీ కీలక పాత్రే. అలాంటి క్రూర మృగాలలో ముఖ్యమైనది పులి. చూపులో గాంభిర్యాన్ని, జీవనంలో రాజసాన్ని కల్గిన ఈ జంతువు అంతరించిపోతూ ఉండడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1973 ఏప్రిల్‌ 1న ప్రాజక్టు టైగర్‌ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలే ఈ కార్యక్రమం 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజక్టు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మాంసాహార జంతు సంరక్షణ కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అఖిల భారత పులుల అంచనా నివేదికను విడుదల చేశారు. అంతర్జాతీయ పెద్దపులుల కూటమిని ప్రారంభించారు. ప్రాజక్టు టైగర్‌ విజయానికి చిహ్నంగా రూ. 50 స్మారక నాణేన్ని మోదీ విడుదల చేశారు. భారత పులుల అంచనా నివేదిక ప్రకారం దేశంలో 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167 పులులు ఉన్నాయి. ప్రాజక్టు టైగర్‌ విజయవంతం అయ్యింది అనడానికి ఏటికి ఏడు పెరుగుతున్న ఈ సంఖ్యలే నిదర్శనం.

జీవ వైవిధ్యం కోసం పులుల సంరక్షణ: పులుల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేయడం వెనక పెద్ద కథే ఉంది. పులి తన ఆధీన ప్రాంతంలోని సకల జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడే జంతువు. పులులను కాపాడడం అంటే అడవులను, అందులోని జీవరాశులని, జీవ వైవిధ్యాన్ని కాపాడడమే అవుతుంది. పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అభయారణ్యాల వల్ల కలిగే ప్రయోజనాల విలువను భారత అటవీ నిర్వహణ సంస్థ, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ కలిసి లెక్కగట్టాయి. 2019లో కేవలం పది పులుల అభయరణ్యాల్లో జరిపిన అధ్యయనం ప్రకారం వాటి నుంచి ప్రతి సంవత్సరం రూ.5 లక్షల 96 వేల కోట్లు ప్రయోజనాలు ఒనగూరుతున్నట్లు తెలిసింది. వీటి వల్ల ప్రత్యక్షంగా కలిగే లాభాలను పరిశీలిస్తే టైగర్‌ రిజర్వుల వల్ల ఉపాధి అవకాశాలు లభించడంతో సహా, కలప, కలపేతర ఉత్పత్తుల నుంచి ఆదాయం వస్తుంది. కర్బన నిక్షిప్తీకరణం, మంచినీటి సరఫరా, మన్ను సంరక్షణ, అనేక జీవజాతులకు ఆవాసంగా ఉండడం, శీతోష్ణస్థితిని అదుపులో ఉంచడం వంటివి కనిపించని లాభాలు.

ప్రాజక్టు టైగర్‌: పులుల వల్ల కలిగే లాభాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాటి సంరక్షణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ప్రాజక్టు టైగర్‌ను ప్రారంభించింది. దేశంలోని తొమ్మిది పులుల రక్షిత ప్రాంతాల్లో 18 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ప్రారంభం కాగా, ప్రస్తుతం అది 53 పులుల రక్షిత ప్రాంతాలతో సుమారు 76 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్దపులుల సంఖ్య లక్ష ఉండేది. భారత్‌లో ఆ సంఖ్య అప్పట్లో 40 వేలు. అయితే 1970 నాటికి ఆ సంఖ్య 1,800కు పడిపోయింది. అభివృద్ధి పనుల కారణంగా పులుల ఆవాసాలు దెబ్బతినడం, పంట పొలాల విస్తరణ, శాకాహార జంతువులు తగ్గిపోవడం కారణంగా పులుల సంఖ్య క్షీణించింది. అప్పటి బ్రిటీష్‌ పాలకులు, మహారాజులు పులులను పెద్ద సంఖ్యలో వేటాడడం కూడా వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణమైంది. దేశంలో పులుల సంఖ్య మరింత తగ్గి అవి అంతరించిపోకుండా 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో అటవీ అధికారి, వన్యప్రాణి నిపుణుడు కైలాష్‌ సాంఖలా ప్రాజక్టు టైగర్‌కు రూపకల్పన చేశారు. ఈ ప్రాజక్టుకు ఆయనే మొదటి సంచాలకుడిగా వ్యవహరించారు.

కోర్‌, బఫర్‌ జోన్ల వ్యూహం:ప్రాజక్టు టైగర్‌లో భాగంగా పులుల రక్షణ, ఆవాస స్థితిగతులను మెరుగుపర్చేందుకు కార్యక్రమాలు చేపట్టారు. ఇది సత్ఫలితాలు ఇచ్చి దేశంలో పులుల సంఖ్య పెరిగింది. 2018 నాటికి దేశంలో వాటి సంఖ్య 2,967కు చేరింది. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70శాతం భారత్‌లోనే ఉండడం ప్రాజక్టు టైగర్‌ విజయవంతం కావడానికి ఉదాహరణ. ఇది ఇంతలా విజయం సాధించడంలో కోర్‌, బఫర్‌ జోన్ల వ్యూహం చాలా సహకరించింది. కోర్‌ జోన్లలో మానవ సంచారం, ఇతర కార్యకలాపాలకు ఆస్కారం ఉండదు. అందువల్ల పులులకు అధిక రక్షణ లభిస్తుంది. అవి నిరాటంకంగా జీవించడానికి ఇది దోహదం చేస్తుంది. కోర్‌ జోన్ల చుట్టూ ఉండే ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా పిలుస్తారు. కోర్‌జోన్‌లో పులుల సంఖ్య పెరిగి వాటి మధ్య ఆధిపత్య పోరు తలెత్తినపుడు అవి బయటకు వచ్చి బతికేందుకు బఫర్‌ జోన్‌లు సహాయం చేస్తాయి. బఫర్‌ జోన్‌ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకానికి అనుమతిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కార్బాట్‌, మధ్యప్రదేశ్‌లోని కన్హా, మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం అలాంటి పర్యావరణ పర్యాటకానికి పేరుగాంచాయి.

ప్రాజెక్టులో ఇబ్బందులు ఎదురైనా: పులుల సంరక్షణలో అత్యంత విజయవంతమైన కార్యక్రమంగా పేరుగాంచిన ప్రాజక్టు టైగర్‌ కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. వాటి సంఖ్యను పెంచేందుకు చేసిన ప్రయత్నాలు కొన్ని సార్లు విఫలం అయ్యాయి. 2006లో దేశంలో పులుల సంఖ్య ఒక వెయ్యి 411కు పడిపోయింది. అక్రమ వేట కారణంగా 2005 నాటికి రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్‌ రిజర్వు నుంచి పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ నేపథ్యంలో పర్యావరణవేత్త సునీతా నారాయణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టైగర్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు మేరకు చట్టబద్ధమైన జాతీయ పులుల ప్రాధికార సంస్థ ఏర్పాటైంది. 2008 నాటికి మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వు నుంచి కూడా పులులు పూర్తిగా అంతరించిపోయాయి. సంరక్షణ చర్యల్లో భాగంగా పులులను తిరిగి అభయారణ్యాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల అవి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.

జనాభా పెరుగుదల పులుల ఆవాసాలకు హాని: పులుల సంరక్షణ కోసం ప్రాజక్టు టైగర్‌ ప్రాజక్టు కింద కృషి, తాజాగా ప్రధాని మోదీ అంతర్జాతీయ పులుల కూటమిని ప్రారంభించడం వాటి సంరక్షణ కీలకమే అయినా ఈ మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మానవ జనాభా పెరుగుదల వల్ల కలుగుతున్న ఒత్తిడి, పులుల ఆవాసాల నష్టం, అంతర్జాతీయ మార్కెట్‌లో పులుల శరీర భాగాలకు ఉన్న డిమాండ్‌ కారణంగా సాగుతున్న వేట వంటివి ప్రాజక్టు టైగర్‌ కార్యక్రమానికి సవాళ్లు విసురుతున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు నిపుణులు పలు సలహాలు సూచిస్తున్నారు. పులుల ఆవాసాల నాశనాన్ని అరికట్టడం, శాకాహార జంతువుల రక్షణ, పులులు సంచరించే ప్రాంతాల మధ్య ప్రత్యేక నడవాల ఏర్పాటు వంటి చర్యలు ప్రాజక్టు టైగర్‌ ముందుకు సాగడానికి దోహదం చేస్తాయని అంటున్నారు. అయితే ఇందుకోసం స్థానికుల భాగస్వామ్యం, నిధుల కేటాయింపు అవసరం అని సూచిస్తున్నారు. అన్ని అడవులు, అభయారణ్యాల్లో పులుల జనాభాను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రధాని ఆదివారం ప్రారంభించిన అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి ఓ ముందడుగా భావిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచ దేశాలతో అనుభవాలను పంచుకుని దేశంలో పులుల సంరక్షణకు మరింత గట్టి కృషి జరిగే అవకాశం ఉందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.