అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం - ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు
Two People Died in Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్ పోస్ట్ సమీపంలో.. తిరుపతి ప్రధాన రహదారిపై తిరుపతి వైపు నుంచి వస్తున్న మినీ వ్యాన్.. రాజంపేట వైపు నుంచి వస్తున్న బైక్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఈశ్వర్ నారాయణ, హుస్సేన్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాలు అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాలును రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స అందిస్తున్నారు. మృతులు పుల్లంపేట మండలం దలవాయిపల్లికి చెందిన వారని తెలిసింది. యువకుల మృతితో వారి స్వగ్రామంలో విషాధచాయాలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారులు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.