ఏసీబీ అధికారుల నుంచి సబ్ రిజిస్ట్రార్ పరారీ, రెడ్ హ్యాండెడ్​గా చిక్కి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 1:30 PM IST

thumbnail

Sub Registrar Escape from ACB: అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు నాయక్ తప్పించుకున్నారు. లంచం తీసుకుంటూ..  శ్రీనివాసులతోపాటు, డాక్యుమెంట్‌ రైటర్‌ శ్రీహరి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో  వారిని అదుపులోకి తీసుకుని ఆఫీస్​లో విచారణ చేస్తుండగా రాత్రి 10 గంటల సమయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ తప్పించుకున్నాడు. అయితే ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్​ను తప్పించారా.. లేదా పారిపోయాడా.. అనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అంతమంది ఏసీబీ అధికారులు ఉంటే పారిపోవడం సాధ్యమయ్యే పనేనా..! అని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కంచె చేను మేసే విధంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి తన సొంత ఆస్తిని మార్చిలో రిజిస్టర్​ చేసుకున్నారు. అందుకుగాను అప్పట్లో రూ.30 వేలు లంచం ఇచ్చారు. స్టాంపు డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆడిట్‌లో గుర్తించారు. ప్రభుత్వానికి రూ.4 లక్షల మేర చెల్లించాల్సి వస్తుందని, రూ.లక్ష ఇస్తే దాన్ని మాఫీ చేస్తామని సబ్‌రిజిస్ట్రార్‌ చెబుతున్నారని డాక్యుమెంట్‌ రైటర్‌ శ్రీహరి.. లింగాల సురేంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. చివరికి రూ.50వేలకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఈనెల 16న బాధితుడు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం సురేంద్రారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ను కలిసి రూ.10వేలు ఇవ్వగా డాక్యుమెంట్‌ రైటర్‌కు ఇవ్వాలని ఆయన సూచించారు. ఆ ప్రకారమే డాక్యుమెంట్‌ రైటర్‌కు నగదు ఇచ్చారు. ఆ డబ్బు సబ్‌రిజిస్ట్రార్‌కు అందగానే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.