దళిత యువకుడు బొంతు మహేంద్రది ప్రభుత్వ హత్యే - ఎస్సీలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు : దగ్గుబాటి పురందేశ్వరి
Purandeshwari on Dalit Youth Mahendra Death: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంతు మహేంద్రది ముమ్మాటికీ వైసీపీ నాయకుల హత్యేనని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. మహేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె.. ఫ్లెక్సీ చింపాడన్న నెపంతో మహేంద్రను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు బాధించడం, దాంతో ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు.
Purandeshwari Comments: ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు మహేంద్ర కుటంబ సభ్యులను శనివారం దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..''మహేంద్ర మృతి పూర్తిగా ప్రభుత్వ హత్యే. ఆ యువకుడి మృతికి కారణమైన వారిని శిక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి తానేటి వనితపై ఉంది. మహేంద్ర ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకుని.. వివిధ ఆసుపత్రులకు తిప్పిన తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించాలి. జగన్ హయంలో ఎస్సీలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్ ఈ కుటుంబానికి ఏం చేశారు..?.'' అని పురందేశ్వరి నిలదీశారు.