Police Arrested Maoist Muruvapalli Raji: శ్రీ సత్యసాయి జిల్లాలో మావోయిస్టు పశ్చిమ కమిటీ సభ్యురాలు అరెస్ట్: ఎస్పీ మాధవరెడ్డి
Police Arrested Maoist Muruvapalli Raji: మావోయిస్టు పశ్చిమ కమిటీ సభ్యురాలు మురువపల్లి రాజీ అలియాస్ సరస్వతిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తచెరువుకు వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్రణాళికతో ఆమెపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె (రాజీ) వద్దనున్న నగదును, మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు.. ఎస్పీ మాధవరెడ్డి వివరాలను వెల్లడించారు.
SP Madhav Reddy Comments: ఎస్పీ మాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం మావోయిస్టు పశ్చిమ కమిటీ సభ్యురాలు మురువపల్లి రాజీ అలియాస్ సరస్వతిని అదుపులోకి తీసుకున్నాం. ఆమె కొత్తచెరువుకు వస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దాంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశాం. రాజీ ప్రస్తుతం.. కేరళ, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్ర రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సాగిస్తోంది. ముఖ్యంగా దాడులకు వ్యూహం రచించడం, నిరుద్యోగ యువతను మావోయిస్ట్ పార్టీలోకి రిక్రూట్ చేసుకోవటం, వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలపాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా, పార్టీకి బలవంతంగా ఫండ్స్ సమకూర్చడంలో ఆమె కీలకపాత్ర పోషిస్తుంది. తనకల్లు మండలం సున్నంవారిపల్లికి చెందిన సరస్వతి 1999వ సంవత్సరంలో ఆర్‌వైఎఫ్ పార్టీలో చేరింది. ఆ తర్వాత మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై.. కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. ఆమెను అదుపులోకి తీసుకొని జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచాం'' అని ఆయన వివరాలు వెల్లడించారు.