Polavaram Project: పోలవరానికి జగన్ ప్రభుత్వమే శాపం.. నాలుగేళ్లలో 2 శాతమే పురోగతి..: నిమ్మల

By

Published : Jul 4, 2023, 9:04 PM IST

thumbnail

Nimmala Ramanaidu: పోలవరం నిర్మాణంపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడని తెలుగుదేశం శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. షెకావత్ వ్యాఖ్యలు జగన్ రెడ్డి చేతగానితనాన్ని ఎత్తిచూపాయని నిమ్మల ఆక్షేపించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ కుంగిపోవడానికి జగన్ రెడ్డి ధనదాహం, అసమర్థత, చేతగానితనమే కారణమని మండిపడ్డారు. 2020 ఆగస్ట్ లో వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే.. 2021, 2022జూన్ కి ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ఎలా చెప్పారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్​కు జగన్ ప్రభుత్వం శాపంలా మారిందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రజెక్ట్ ఎజెన్సీని మార్చవద్దంటూ కేంద్రం గతంలోనే హెచ్చరించిందని.. జగన్  కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పెడచెవిన పట్టారని విమర్శించారు. జగన్ కమీషన్ల కోసం అధికారంలోకి వచ్చిన నెలలోనే ప్రాజెక్ట్ పనులు చేస్తున్న సంస్థల్ని పక్కనపెట్టారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ డ్రామాలాడి, తనకునచ్చిన సంస్థలకు పనులు అప్పగించాడని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పోలవరం ఫైలింగ్ సక్రమంగా లేదని నిమ్మల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ పై ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రే స్వయంగా ప్రశ్నించారని నిమ్మల వెల్లడించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్​కు సంబంధించి జగన్ ప్రభుత్వం కేవలం రెండు శాతం పనులు మాత్రమే చేసిందని నిమ్మల విమర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.