కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి పట్టాలపై - చావు అంచుల వరకు వెళ్లిన వ్యక్తి
Man Felt Under Train in Jammalamadugu: కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నంచిన ఓ వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. కదులుతున్న రైలులో ఎక్కడం గానీ, దిగడం చేయకూడదని రైల్వే శాఖ హెచ్చరిస్తూనే ఉంది. అయినా సరే కొందరు వ్యక్తులు మాత్రం కదిలే రైలు ఎక్కే ప్రయత్నం చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కూడా ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంకు రైలుకు మధ్యలో పడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అసలేం జరిగిందంటే.. కడప జిల్లాలోని జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించి రైలు, ఫ్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు. గమనించిన కొందరు ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో రైలును నిలిపేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైలు దిగి పరిశీలించగా.. అతడు ఫ్లాట్ఫ్లాం, రైలు మధ్యలో ఇరుకున్నాడు. దీంతో అతడ్ని బయటకు తీశారు. రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతడిని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాదితుడి వివరాలపై ఆరా తీయగా.. ప్రకాశం జిల్లా సంతరావూరు ప్రాంతానికి చెందిన రమేశ్గా గుర్తించారు.