మా ఓట్లు కావాలి కానీ మా గోడు పట్టదా - ఎమ్మెల్యే పొన్నాడను నిలదీసిన గ్రామస్థులు
Jagananna Housing Sites Failed People Questioning MLA PONNADA SATISH : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌ను స్థానిక సమస్యలపై గ్రామస్థులు నిలదీశారు. శ్మశాన వాటికల పక్కన జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చినా అది లోతట్టు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకొని దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న ఇళ్ల స్థలాలలో సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని గ్రామస్థులు పేర్కొన్నారు. కరెంటు, రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. మంచినీటి కుళాయిలలో మురికినీరు రావటంతో డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చి తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నామని గ్రామస్థులు కన్నీటి పర్యంతవుతున్నారు. మా ఓట్లు కావాలి కానీ మా గోడు మీకు పట్టదా అంటూ ఎమ్మెల్యేను గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు చేస్తాం.. చేస్తాం..అంటూ అక్కడ నుంచి నెమ్మదిగా ఎమ్మెల్యే జారుకున్నారని తెలిపారు.