High Court on Social Media Trolls on Judges: క్రిమినల్‌ కోర్టుధిక్కరణపై ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 10:47 AM IST

thumbnail

High Court on Social Media Trolls on Judges: చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వెల్లడి అనంతరం న్యాయమూర్తులు, న్యాయాధికారిని అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ దాఖలు చేసిన క్రిమినల్‌ కోర్టుధిక్కరణపై హైకోర్టు స్పందించింది. కోర్టుధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. 

ప్రతివాదుల జాబితాలో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలకు సంబంధించిన యాజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో మువ్వా తారక్‌ కృష్ణ యాదవ్, రవికుమార్‌ ముదిరాజ్, రుమాల రమేశ్, యల్లారావు, కల్యాణి, ఎన్‌.చిరంజీవి, చైతన్యకుమార్‌రెడ్డి, ఎస్‌. రామకృష్ణ, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు గూగుల్‌ ఇండియా, ట్విటర్, ఫేస్‌బుక్‌ సంస్థ ఉన్నాయి. మొత్తం 26 మందికి నోటీసులు ఇచ్చింది.

విచారణను అక్టోబర్‌ 25కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబునాయుడికి అనిశా కోర్డు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడం, మరోవైపు ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్​ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సంబంధిత న్యాయాధికారి, హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారని పేర్కొంటూ ఏజీ శ్రీరామ్‌ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

చంద్రబాబు విషయంలో న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాక సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పోస్టులు పెట్టారని ఏజి వాదనలు వినిపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ తనకు రెండు వినతులు అందాయన్నారు. గతంలోనూ ఇలాగే పోస్టులు పెడితే హైకోర్టు సుమోటోగా విచారణ జరిపిందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విచారణను అక్టోబర్‌ 25కి వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.