విశాఖలో మరో కొండకు ఎసరు! - వాహనాల పార్కింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
Forest Department Actions on Excavation at Tenneti Park: విశాఖలో ప్రకృతి విధ్వంసాన్ని జీవీఎంసీ అధికారులు కొనసాగిస్తున్నారు. అదనపు పార్కింగ్ స్థలం కోసం తెన్నేటి పార్కు ఎదురుగా ఉన్న కొండను వీఎంఆర్డీఏ ఉత్తర్వులతో తొలగిస్తున్నారు. పర్యావరణానికి భంగం వాటిల్లేలా పెద్ద వృక్షాలను తొలగిస్తున్నారని, కొండను తొలిచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ఈ మేరకు అటవీ శాఖకు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వీఎంఆర్డీఏను, పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను సంబంధిత శాఖలు వివరణ అడిగాయి. వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అయిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు పార్కింగ్ స్థలం కోసమే అక్కడ చర్యలు చేపట్టామని వీఎంఆర్డీఏ అధికారులు రెండు శాఖలకు స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్‌కు అక్కడ చెట్లను తొలగించడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీ శాఖ అధికారులు మాత్రం కొన్ని వృక్షాలు తొలగించిన తీరుపై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. రాత్రి పూట పని చేస్తున్న సమయంలో అవి పడిపోయాయని కాంట్రాక్టర్ వివరణ ఇచ్చినట్లు అటవీ శాఖ.. మూర్తియాదవ్‌కు తెలిపింది. వాల్టా చట్టం కింద ఆ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చింది. ఉల్లంఘనలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసినట్లు కార్పొరేటర్ మూర్తి యాదవ్ వెల్లడించారు.