పోలీసులకు అడ్డుపడి విడిపించుకుని తీసుకెళ్లారు - ఎస్ఐపై ఎలాంటి దాడి జరగలేదు : డీఎస్పీ శ్రీనివాసులు
DSP Srinivasulu on Avuku ZPTC Threat Case: అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మిని బెదిరించిన కేసును.. నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేస్తున్నారని.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జడ్పీ ఉపాధ్యక్షుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని అవుకు ఎస్సై అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. సుధాకర్ వర్గీయులు అడ్డుకున్నారన్నారు. ఎస్సై విష్ణు నారాయణ మీద ఎలాంటి దాడి జరగలేదని డీఎస్పీ వెల్లడించారు. కేసు విచారణలో అవుకు పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో అవుకు పోలీసుల బృందం ధర్మవరానికి వస్తారని డీఎస్పీ వివరించారు.
DSP Srinivasulu Comments: ''జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మిని బెదిరించిన కేసును ప్రస్తుతం నంద్యాల జిల్లా అవుకు పోలీసులు విచారిస్తున్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఆమె (శ్రీలక్ష్మి) ఈ నెల 1వ తేదీన అవుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ సిమ్ కార్డు ఎవరిదన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు. దాంతో ఈ ఘటన వెనక ఉన్నది అనంతపురం జడ్పీ వైస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి తేలింది. సుధాకర్‌రెడ్డిని శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. అతని అనుచరులు పోలీసులను అడ్డుపడి.. వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదంలోనే సుధాకర్‌రెడ్డిని వాళ్లు విడిపించుకుని తీసుకెళ్లారు.'' అని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.