లక్షల బహుమతి కోసం పైశాచికత్వం - ఎద్దులకు మత్తెక్కించి పరుగులు తీయించారు
Conduct Of Bull Competitions In Chittoor District: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో జల్లికట్టు మాదిరి పోటీలు నిర్వహించారు. రాజకీయ నాయకుల అండదండలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ పోటీలను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో ఎగబడ్డారు. దాదాపు వంద ఎద్దులతో ఈ పోటీలను నిర్వహించారు. లేగ దూడలను సైతం మత్తు ఎక్కించి ఈ పోటీల్లో నిర్వాహకులు పరుగులు పెట్టించారు. ఈ రేసులో గెలవటం కోసం ఎద్దు కడుపునకు బిగుతైన దారంతో తోకను బంధించి వాటికి నొప్పి కలిగేలా చేసి బహుమతి సాధించడానికి పోటీదారులు పైశాచికత్వం ప్రదర్శించారు.
పోటీల్లో గెలిచిన వారికి నగదు రూపంలో బహుమతిని ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. మూడు రాష్ట్రాల నుంచి పశు యజమానులు వారి దగ్గర ఉన్న ఎద్దులతో పోటీల్లో పాల్గొన్నారు. మొదటి బహుమతిగా లక్ష రూపాయలను నిర్వాహకులు ప్రకటించారు. డబ్బు రూపంలోనే కాకుండా ఇంకా 40 బహుమతులను సైతం ఈ పోటీలో గెలిచినవారు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఇటు వైపు తొంగిచూడటం లేదనే విమర్శలు వెలువెత్తున్నాయి.