6 గంటల విచారణ తర్వాత సాఫ్ట్వేర్ రామును వదిలిపెట్టిన సీఐడీ - 28న రావాలని నోటీసులు
Published: Nov 21, 2023, 7:05 PM

CID Arrest a Person due to Posted Against Govt : ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ పెట్టిన గుంటూరు జిల్లాకు చెందిన రామును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన రాము గతేడాది నుంచి మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టారంటూ నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి వచ్చారని రాము భార్య రేణుక చెప్పారు. ఉదయం పది గంటలకు వచ్చిన నలుగురు వ్యక్తులు రామును సుమారు గంటపాటు ప్రశ్నించారని తెలిపారు.
సాయంత్రం విడిచి పెడతామంటూ తీసుకెళ్లారని ఇంతవరకు ఆయన ఆచూకీ లేదంటూ.. వాపోయారు. ఎక్కడికి తీసుకు వెళ్తున్నారని అడిగినా చెప్పలేదు. చివరికి మీరెవరని అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సీఐడీ వత్తాసు పలుకుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎత్తిచూపిన వ్యక్తులను అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిది నెలల క్రితం పోస్టింగ్ పెడితే ఇప్పుడు రావడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
6 గంటల విచారణ తర్వాత: ఆరు గంటల విచారణ అనంతరం సీఐడీ అధికారులు రామును వదిలిపెట్టారు. మళ్లీ మంగళవారం (28న) రావాలని నోటీసులు ఇచ్చారు. రాము అరెస్టు రూల్ ఆఫ్ లా ప్రకారం జరగలేదని హైకోర్టు న్యాయవాది భానుప్రసాద్ అన్నారు. సీఐడీ వైఖరిని కోర్టులో ప్రశ్నిస్తామని తెలిపారు.