వణికిస్తున్న చెడ్డీగ్యాంగ్ - తిరుపతిలో వరుస దొంగతనాలతో హల్‌చల్
Cheddi Gang Hulchul in Tirupati: తిరుపతిలో వరుస దొంగతనాలతో చెడ్డీగ్యాంగ్ (Cheddi Gang) హల్‌చల్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మారుతి షోరూమ్‌లో, శనివారం రాత్రి శ్రీవారి విల్లాస్‌లో చోరీకి పాల్పడ్డారు. చెడ్డీగ్యాంగ్.. శివారు ప్రాంతాల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని.. పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు తెగబతున్నారు. వరుస చోరీలపై ఎం.ఆర్.పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Cheddi Gang: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ (కొన్ని ప్రాంతాల్లో) రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో నివసించే పలు తెగలను 'చెడ్డీ గ్యాంగ్'గా పిలుస్తుంటారు. కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా కొన్ని రాష్ట్రాల పోలీసులు నామకరణం చేశారు. ఒక్కో ముఠాలో పది నుంచి పదిహేను మంది వరకు ఉంటారు. బనియన్లు, చెడ్డీలు ధరించి.. చేతిలో రాడ్‌తో వీరు దొంగతనాలు చేస్తుంటారు. పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికీ తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తుంటారు.
నిర్మానుష్య ప్రాంతాలు/కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా చూసినా.. ప్రతిఘటించేందుకు యత్నించినా దాడి చేసేందుకు వెంట రాళ్లను తీసుకెళ్తుంటారు. చోరీలకు వెళ్లే ముందు గ్రీజు లేదా నూనె ఒళ్లంతా పూసుకుంటారు. అందుకే.. ఒంటిపై బనియన్లను మాత్రమే ఉంచుకుంటారు. అలికిడి వినిపించకుండా ఉండేందుకు చెప్పులు నడుముకు కట్టుకుంటారు. ఎలాంటి తాళంనైనా చప్పుడు రాకుండా వీరు పగులగొడతారు.