పొలాల్లో అంబేడ్కర్ విగ్రహాం- సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
Ambedkar Statue In Fields Went Viral social Police Responded Immediately: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో పొలాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు స్థానిక ఎస్సీ నేతల సహకారంతో విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లో పడి ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు, ఎస్సీ నాయకులు అక్కడి నుంచి తరలించారు. ప్రముఖులు నివాసముండే ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఎవరు పడేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కొంతమంది ఆకతాయిలు కావాలని పడేశారా లేక శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. విగ్రహాన్ని పొలంలో నుంచి భారీ యంత్రాంగం సహాయంతో బయటకు తీసుకువచ్చి వాహనంలోకి ఎక్కించారు. స్థానికులు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని పొలాల్లో పడేయటం పట్ల స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి పనులు చేస్తున్న వారిని పట్టుకొని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.