అనిశా వలలో భూగర్భశాఖ అధికారి - బయటపడ్డ కోట్ల ఆస్తులు
ACB Raids in Nandyala District : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో నంద్యాల జిల్లా మైనింగ్ విభాగంలో పనిచేసే అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. భూగర్భ శాఖలో పనిచేస్తున్న సహాయ జియాలజిస్ట్ వెంకటేశ్వర్లు కార్యాలయం, గుంటూరు జిల్లాలోని పెదకాకాని సమీపంలోని ఆయన నివాసంలో అనిశా అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడులలో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అనిశా ఏఎస్పీ మహేంద్ర ప్రకటించారు. దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 21ప్లాట్లు, ఖరీదైన భవనం, మరికొన్ని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
మరో ఘటనలో.. నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఏవో సువర్ణకుమారికి కర్నూలు నగరంలో విలాసవంతమైన భయనం.. తొమ్మిది చోట్ల ఇళ్ల స్థలాలు.. రూ.8 లక్షల విలువ చేసే గృహోపకరణాలతో లెక్కకు మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధకశాఖ అధికారులు(Anti Corruption Bureau) గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఆమె ఇంటిపై అనిశా అధికారులు శుక్రవారం సోదాలు చేయగా రూ. కోటికి పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అనిశా అధికారులు తెలిపారు.