ETV Bharat / state

అవయవదానం చేసి.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన యువతి

author img

By

Published : Jan 4, 2023, 10:27 PM IST

Organ Donation: ఆ యువతి అందరితో నవ్వుతూ మాట్లాడేది. ఆ ప్యాయంగా పలకరించేది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సంతోషంగా సాగి పోతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. మెదడులో రక్తం గడ్డ కట్టి యువతి మృతిచెందడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. తమ కుమార్తె ఇకలేదన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె చనిపోతూ అవయవ దానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ ఘటన వైయస్సార్ జిల్లాలో జరిగింది.

young woman donated organs in ysr district
young woman donated organs in ysr district

Organ Donation: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరాంనగర్​కు చెందిన విశ్రాంత లైన్ ఇన్​స్పెక్టర్​ దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి రెండో కుమార్తె సుచిత్ర (25) ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో రెండేళ్ల కిందట బెంగళూరుకు వెళ్లింది. సుచిత్రకు గతేడాది డిసెంబరు 28న తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆమెను స్నేహితులు ప్రొద్దుటూరులోని తల్లిదండ్రులు వద్ద వదిలి వెళ్లారు. కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. డిసెంబర్ 31న ఎంఆర్ఐ స్కానింగ్ తీయగా మెదడులో రక్తం గడ్డ (బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ) కట్టినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వారి సూచనల మేరకు అదే రోజు రాత్రి హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ నెల 1వ తేదీన శస్త్రచికిత్స చేశారు. అనంతరం మెదడులోని రక్తం గడ్డ కట్టడంతో మందులకు ఆమె శరీరం సహకరించలేదు. ఆ యువతి ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది.

తాను మృతి చెందినా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ యువతి సంకల్పించింది. తాను చనిపోయిన తరువాత అవయవాలు దానం చేస్తానని గతంలోనే ఆమె రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మృతి చెందడంతో యువతి చికిత్స పొందిన ఆసుపత్రిలో ఆమె కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం దానం చేశారు. ఆ యువతిని అభినందిస్తూ ఆసుపత్రి నిర్వాహకులు కుటుంబసభ్యులకు ప్రశంసాపత్రం అందించారు.

సుచిత్ర అక్క రూప శరణ్య కూడా బెంగళూరులోనే మరో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఫిబ్రవరిలో ఆమెకు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువకుడితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు పది రోజుల కిందటే వారికి నిశ్చితార్ధం కూడా అయింది. కుటుంబమంతా ఆ సంతోషంలో ఉండగా ఈ సంఘటన జరగడం అందరినీ కలిచివేస్తోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.