ETV Bharat / state

Avinash Anticipatory Bail: అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ..!

author img

By

Published : Apr 26, 2023, 10:41 PM IST

Viveka's murder case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్‌పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Etv Bharat
Etv Bharat

Viveka's murder case: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ్టి విచారణ జాబితాలో లేనందున ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కడపలో వైసీపీ ముఖ్య నేతలతో అవినాష్‌ సమావేశం కాగా, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. అవినాష్ అరెస్టు తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినాష్‌పై సీబీఐకి కక్ష ఎందుకు ఉంటుందన్న తెలుగుదేశం నేతలు.. జగన్ చేతిలో సీబీఐ ఉండి ఉంటే సునీతను, ఆమె భర్తను అరెస్ట్ చేయించేవారని ఆరోపించారు.

వివేకా కేసులోఅవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. బుధవారమే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తొలుత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి.. పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సమాచారమిచ్చారు. కానీ జాబితాలో అవినాష్ రెడ్డి పిటిషన్ లేకపోవడంతో కోర్టు మొదలవగానే పిటిషన్‌పై విచారణ జరపాలని అవినాష్ తరపు న్యాయవాదులు కోరారు. బుధవారం జాబితాలో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గురువారం విచారణ చేపట్టాలని కోరగా, అందుకు సమ్మతించిన న్యాయమూర్తి గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ చేపడతామని తెలిపారు. తమ న్యాయవాదులు అందుబాటులో లేనందున శుక్రవారం వాదనలకు అనుమతించాలని సునీతారెడ్డి న్యాయస్థానానికి విన్నవించారు. గతంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించగా... ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు: మరోవైపు హైదరాబాద్‌ బయలుదేరే ముందు ఎంపీ అవినాష్‌, కడప ఆర్​&బీ అతిథిగృహంలో వైసీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మేయర్ సురేష్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని కుట్రపూరితంగా ఇరికించారని రాచమల్లు ఆరోపించారు. అయితే అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని, ఆ తరువాత బెయిల్​పై బయటికొస్తారని రాచమల్లు అన్నారు.

సీబీఐకి అవినాష్‌పై కక్ష ఎందుకు?: వివేకా కేసును సీరియస్‌గా తీసుకుని ఉంటే తన అన్న అధికారాన్ని, తన ఎంపీ పదవిని వాడుకొని ఎప్పుడో బయటపడే వాడినని అవినాష్ రెడ్డి చెప్పకనే చెప్పారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. సీబీఐకి అవినాష్‌పై కక్ష ఎందుకుంటుందని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడు జైలుకెళ్తారా అని మంత్రులు చూస్తున్నారన్న బుద్దా వెంకన్న... అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ కూడా జగన్ చేతుల్లో ఉంటే వివేకా కుమార్తె, అల్లుడిని జైల్లో పెట్టించేవారని బుద్దా మండిపడ్డారు.

మరోవైపు తుమ్మలపల్లి యూసీఐఎల్‌లో పని చేసే ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తుమ్మలపల్లి యూసీఐఎల్‌ మెకానికల్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులైన టి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరాజేశ్‌, రాజును సీబీఐ అధికారులు విచారించారు. గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి మెకానికల్‌ విభాగంలోనే పని చేస్తున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలను మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మరోసారి వివేకా వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.